- నిర్లక్ష్యానికి గురవుతున్న వీరభద్రస్వామి ఆలయం
- శిథిలమవుతున్న పురాతన ఆలయాలు, కోనేర్లు
- ఆదాయం ఉన్నా.. హామీలతోనే సరిపెట్టిన గత సర్కార్
- వారం రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆలయ భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు గుట్టపై ఉన్న పురాతన ఆలయాలు, కోనేరులు శిథిలం అవుతున్నాయి. ఆలయానికి ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఇక కొత్తకొండ అభివృద్ధి చెందుతుందనిప్రజలు ఆశతో ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు వస్తారు. మరో ఆరు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో గ్రామ, ఆలయ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
కనుమరుగవుతున్న పురాతన ఆనవాళ్లు
కొత్తకొండలో ఉన్న పురాతన ఆనవాళ్లు, ఆలయాలను పట్టించుకోకపోవడంతో అవికాస్తా కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. ఆలయ ఆవరణలోని విష్ణుమూర్తి గుడి భూగర్భంలో కలుస్తోంది. శివుడి విగ్రహం ఉండే బర్రెల గుడిని పూర్తిగా తొలగించి, తర్వాత దానిని పట్టించుకోవడం మానేశారు. ఇక్కడున్న పాత కోనేరును పట్టించుకోకపోగా గుట్టపై ఉన్న ఏడు కోనేర్లను కూడా గాలికొదిలేశారు.
దీంతో అధికారులు, పాలకుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు ఆలయానికి 16 ఎకరాల వరకు భూమి ఉండగా సుమారు మూడు ఎకరాలు ప్రైవేట్ పరమయ్యాయి. జాతర సమయంలో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తుతుండగా మరుగుదొడ్ల ఏర్పాటులోనూ నిర్లక్ష్యం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఆదాయం ఉన్నా.. అభివృద్ధి సున్నా
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయినా ఇక్కడ కనీసం బస్టాండ్ కూడా సరిగా లేదు. టెండర్లు, దుకాణాలు, దాతల నుంచి వచ్చే అభివృద్ధి నిధులను దేవస్థానానికి జమ చేయకుండా నేరుగా ఖర్చు పెడుతూ పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధులన్నీ ఆలయానికి జమ చేస్తే ఆదాయంతో పాటు ఆలయ గ్రేడ్ కూడా పెరిగే అవకాశం ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
మరో వైపు కొత్తకొండ ఆలయ అభివృద్ధికి ప్రపోజల్స్ రెడీ చేస్తే కేంద్రంతో మాట్లాడి ‘ప్రసాద్’ స్కీంలో చేర్చి అభివృద్ధికి సహకరిస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గతంలో హామీ ఇచ్చారు. గుట్టపైకి మెట్ల మార్గం ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
మంత్రి పొన్నంపైనే ఆశలు
ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో వీరభద్రుడి ఆలయంలో అభివృద్ధి పనులకు తావు లేకుండా పోయింది. అయితే హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ కొత్తకొండను మండల కేంద్రం చేయడంతో పాటు, ఆలయానికి నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు రేవంత్‌రెడ్డి సీఎం, హుస్నాబాద్ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర మంత్రి అయ్యారు. ఈ నెల 10 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో జాతర ఏర్పాట్లపై గురువారం పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో స్థానికులంతా మంత్రి పొన్నంపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తకొండ అభివృద్ధిపై మంత్రికి ఇప్పటికే అవగాహన ఉండడంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.