
- ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం
- నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం సందర్శన
మంచిర్యాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ఈ టూర్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయన ప్రారంభిస్తున్నారు. శుక్రవారం కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా ‘దళిత గిరిజన దండోరా’ సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.
రేవంత్ శుక్రవారం మధ్యాహ్నం 12:20 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1:30 గంటలకు కేస్లాపూర్ చేరుకుంటారు. అక్కడ నాగోబా ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి, ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:30 గంటలకు రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.
సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నాయి. కాగా, సీఎం టూర్ కు ఉమ్మడి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా పర్యటిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు.