కొడంగల్ ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 75 ఏండ్లలో కొడంగల్ అభివృద్ధికి ఏ నేత కూడా ప్రయత్నం చేయలేదని చెప్పారు. కొడంగల్ లో తనను కిందపడేయాలని విపక్షాలు చాలా ప్రయత్నాలు చేశాయన్నారు. తనను దెబ్బతీసేందుకు కొడంగల్ లో చిచ్చుపెట్టేందుకు కొందరు నేతలు వస్తున్నారని చెప్పారు.
ఎక్కడున్నా తన గుండెచప్పుడు కొడంగలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొడంగల్ లో ఒక్క సీసీ రోడ్లకే 40 కోట్లు కేటాయించామన్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే కొడంగల్ కు 5 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. కొడంగల్ కు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
కొడంగల్ లో ఈ ఐదేళ్లు రాజకీయాలు వదిలేసి అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాని పిలుపునిచ్చారు. రాహుల్ ప్రధాని అయితే పాలమూరు అభివృద్దికి తోడ్పాటు అందిస్తారన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం డీకే అరుణ ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు.
పేదలకు ఉచిత వైద్యం, మహిళలకు ఫ్రీ బస్సు సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నియామకాల కోసం పదేళ్లలో యువత బలిదానాలు చేసుకుందన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీకి కొడంగల్ నుంచి 50 వేల మెజారిటీ ఇవ్వాలని కోరారు.