హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పారు. మహిళల సాధికారతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు పథకాలను ఇప్పటికే అమలు చేసిందని వివరించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తగినంత చేయూతను అందిస్తుందని వెల్లడించారు. మహిళల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడేది లేదన్నారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.