కలెక్టర్‎పై దాడి వెనక ఎంతటివారున్నా వదలం.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: సీఎం రేవంత్ వార్నింగ్

కలెక్టర్‎పై దాడి వెనక ఎంతటివారున్నా వదలం.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: సీఎం రేవంత్ వార్నింగ్

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‎పై జరిగిన దాడి వెనక ఎవరున్నా వదలమని.. ఎంతటి వారైనా  జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం (నవంబర్ 12) సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కలెక్టర్‎పై దాడి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం.. అధికారులపై దాడులు చేసేలా ప్రోత్సహించేవారిని కూడా విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

అధికారులపై దాడి చేసిన వారికి అండగా ఉన్నవారిని కూడా విడిచిపెట్టేది లేదని.. ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులపై భౌతిక దాడులకు పాల్పడుతూ చంపాలని చూస్తోన్నవారిని బీఆర్ఎస్ పార్టీ ఎలా సమర్థిస్తోందని.. అధికారులపై దాడిని బీఆర్ఎస్ ఎందుకు ఖండించదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారులపై దాడి చేసిన వాళ్లను ఆ పార్టీ నేతలు ఎలా పరామర్శిస్తారని నిలదీశారు. 

అధికారులపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరగడంతో ఈ ఘటనలో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో లగచర్ల ఘటను ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుని.. సమగ్ర విచారణకు ఆదేశించింది.