- పీసీసీ కొత్త చీఫ్ నియామకం కూడా..సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
- ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు మంత్రివర్గంలో నో చాన్స్
- పీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం
- మూడ్రోజుల్లో రుణమాఫీపై గైడ్‌లైన్స్
- గత ప్రభుత్వం ఇచ్చిన రూ.75 వేల కోట్ల
- రైతుబంధులో రూ.25 వేల కోట్లు ధనవంతులకే..
- జిల్లాలు, మండలాల డీలిమిటేషన్‌పై త్వరలో కమిటీ
- బీసీ కమిషన్‌లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన
- కాళేశ్వరంపై వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడ్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : వారం రోజుల్లో పీసీసీ కొత్త చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రెండు అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఐదు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. వరుసగా రెండో రోజు శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చలు ప్రారంభమయ్యాయని.. దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి?
ఎవరికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలి? అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని చెప్పారు. ‘‘పీసీసీ చీఫ్ గా రెండు ఎన్నికలు పూర్తి చేశాను. జులై 7తో మూడేండ్ల పదవీకాలం పూర్తి కానుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పీసీసీ చీఫ్ ను హైకమాండ్ ఎంపిక చేస్తుంది. ఈ విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. రేసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన నేతలు కూడా ఉండొచ్చు” అని అన్నారు.
మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ఈ నిర్ణయం బాగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మహిళను పీసీసీ చీఫ్ గా నియమించలేదు” అని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై గెలిచినోళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు కేబినెట్లో బెర్త్ ఉండదని సంకేతాలు ఇచ్చారు.
రూల్స్ బ్రేక్ చెయ్యను..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చెయ్యనని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పులను తాను చెయ్యబోనని అన్నారు. ‘‘రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ లలో బెస్ట్ ఆఫీసర్లతో పాలనను సక్రమంగా కొనసాగిస్తున్నం. పాలనలో కీలకమైంది జిల్లాలు. ఆ జిల్లాలకు సామర్థ్యమున్న కలెక్టర్లు, ఎస్పీలను ఇటీవల నియమించాం. అడ్మినిస్ట్రేషన్ లో నా మార్క్ అవసరం లేదు.. రాష్ట్ర అభివృద్ధిలో నా మార్క్ చూపిస్తాను. కొందరు కోరుకుంటున్నట్టు మార్క్ కోసం వెళ్తే.. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేలోగా పలువురు ఆఫీసర్లు సెక్రటేరియెట్ ను కూడా మాయం చేస్తారు” అని వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపులు ఒక్క తెలంగాణలోనే జరగలేదని అన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోనూ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారని చెప్పారు. ‘‘గతంలో ఏపీలో నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ చేర్చుకుంది. అస్సాంలో ఓ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బీజేపీ చేర్చుకున్నది” అని గుర్తు చేశారు. పాతబస్తీలో విద్యుత్ క్రమబద్ధీకరణ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అదానీతో పాటు ఇతర విద్యుత్ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయని వెల్లడించారు.
ఫ్రీ బస్ స్కీమ్ తో ఆర్టీసీకి ఆమ్దానీ..
పేదలకు అందిస్తున్న ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదని సీఎం రేవంత్ అన్నారు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ పదేండ్లలో కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించలేదు. కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారు. గత అప్పులను పక్కన పెడితే, ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ భవిష్యత్తులో లాభాల బాట పడుతుంది. ఈ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 30 నుంచి 80 శాతానికి పెరిగింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల నుంచి రూ. 350 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నది.
మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడంతో దేవాలయాల్లో హుండీ ఆదాయం పెరిగింది. అక్కడ జీఎస్టీ కూడా పెరిగింది” అని అన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండ్రోజులకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ‘‘వాస్తవ అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను మేం పక్కనపెట్టాం” అని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, వీటి ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారుతుందని అన్నారు.
జిల్లాలు, మండలాల ఏర్పాటు అస్తవ్యస్తం..
రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను తగ్గించే లేదా పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కానీ జిల్లాలు, మండలాల హేతుబద్ధీకరణపై డీలిమిటేషన్ కమిటీ వేయనున్నట్టు చెప్పారు. ‘‘జనాభా, విస్తీర్ణం, మౌలిక వసతుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎట్లపడితే అట్ల మండలాలు ఏర్పాటు చేశారు. ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే, మరో జిల్లాలో కోటి జనాభా ఉంది. ఎలాంటి స్టడీ లేకుండా జిల్లాలు, మండలాల ఏర్పాటు జరిగింది. దీనిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
‘‘ప్రస్తుత బీసీ కమిషన్ లోని సభ్యుల కాలపరిమితి ఆగస్టుతో ముగియనుంది. అందువల్ల కొత్త సభ్యుల నియామకం తర్వాతే బీసీ కులగణన చేపడతాం. రైతు భరోసా, ఇతర కమిషన్లపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం. తెరవెనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు” అని అన్నారు.
అధిక వడ్డీలతో ప్రభుత్వంపై భారం..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తెస్తామని సీఎం రేవంత్ చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నిపుణుల సూచన మేరకు రిపేర్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని, దీంతో ప్రభుత్వంపై భారం పడుతున్నదని తెలిపారు. ‘‘రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరో రూ.లక్ష కోట్ల వరకు పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. నెలకు రూ.7 వేల కోట్లు అప్పులకే కడుతున్నాం. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చింది. దాదాపు 7 నుంచి 11 శాతం వడ్డీ వరకు రుణాలు తెచ్చారు. దీంతో ఆ వడ్డీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
ఎక్కువ శాతం వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ శాతం వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నాం. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక్క శాతం వడ్డీ తగ్గినా నెలకు రూ.700 కోట్ల భారం తగ్గుతుంది. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాం. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని, ఎక్కువ వడ్డీకి తెచ్చిన కాడ కట్టేస్తాం” అని తెలిపారు.
సంస్కరణలతో దేశ ప్రగతిని పీవీ పరుగులు పెట్టించారు : రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి కూడా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానిగా పీవీ చేసిన సేవలు మర్చిపోలేనివని పేర్కొన్నారు.
రుణమాఫీకే ఫస్ట్ ప్రయారిటీ..
రుణమాఫీనే తమ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ అని సీఎం రేవంత్ తెలిపారు. రుణమాఫీపై మూడ్రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ‘‘ఒక కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే రేషన్ కార్డు పరిగణనలోకి తీసుకుంటాం. రుణమాఫీ తర్వాత రైతుబంధు, ఇతర పథకాలపై దృష్టిపెడతాం. గత బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన రూ.75 వేల కోట్ల రైతుబంధు నిధుల్లో రూ.25 వేల కోట్లు ధనవంతులకే చేరాయి.
నాలాలు, రోడ్ల కోసం సేకరించిన భూములకు, ధనవంతులు నిర్మించుకున్న ఇండ్ల లేఅవుట్లకు, టాటాబిర్లాలకు ఈ నిధులు చేరాయి” అని అన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే ధరణిపై కమిటీ వేశామని, అందులోని లోపాలను సరిదిద్దేందుకు సమర్థవంతంగా పని చేస్తున్నామని తెలిపారు.