- సీపీఎస్ రద్దుపై మరో కమిటీ
- 317 జీవోపై త్వరలో జరగనున్నకేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం
- పెండింగ్ డీఏలపైనేడు క్లారిటీ ఇస్తామని వెల్లడి
- ఉద్యోగ సంఘాల నేతలతో3 గంటల పాటు సీఎం సమావేశం
- స్పష్టమైన హామీ ఇచ్చారు: జేఏసీ నేతలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా.. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారని తెలిపారు. దీపావళి తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై, వారి సమస్యలపై చర్చిస్తుందని చెప్పారు.
ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కోచైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన 33 మంది.. మరో ఉద్యోగ జేఏసీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 21 మంది ప్రతినిధులతో గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో కలిసి ఉద్యోగుల సమస్యలపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, 317 జీవో, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీమ్(సీపీఎస్) రద్దు, కొన్ని డిపార్ట్మెంట్లలో నిలిచిన ప్రమోషన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్‌లో బదిలీ అయినోళ్లను తిరిగి పాత స్థానాలకు పంపడం, టీచర్లు, డాక్టర్లు, లెక్చరర్ల సర్వీస్ రూల్స్ తదితర సమస్యలు, డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తెచ్చారు.
ముందుగా ఆర్థిక భారం లేనివి..
ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్థిక పరమైన వాటిపై మార్చి తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెండింగ్డీఏలపై ఫైనాన్స్ అధికారులతో చర్చించి శుక్రవారం క్లారిటీ ఇస్తామని తెలిపారు. ‘‘317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ గత 8 నెలల నుంచి ఉద్యోగులు, సంఘాలతో చర్చించి ఇటీవలే నాకు నివేదిక ఇచ్చింది. ఈ నెల 26న జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం” అని వెల్లడించారు. కీలకమైన సీపీఎస్ రద్దుపైనా కమిటీ వేస్తామని ప్రకటించారు.
టీచర్లు, డాక్టర్లు, లెక్చరర్ల సర్వీస్ రూల్స్ పై త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల టైమ్‌లో బదిలీ అయినోళ్లను తిరిగి పాత స్థానాలకు పంపిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, ఉద్యోగ సంఘాల నేతలు వంగ రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, ముజీబ్, కస్తూరి వెంకట్, చావా రవి, శ్రీపాల్ రెడ్డి, సదానందం గౌడ్, స్థితప్రజ్ఞ, మధుసూదన్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దు చేయాలి: స్థితప్రజ్ఞ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఆయా చోట్ల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని చెప్పారు. కాగా, తమ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని సీఎం చెప్పినట్టు టీఎన్జీవోస్జనరల్ సెక్రటరీ ముజీబ్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారని జేఏసీ నేత రవీందర్ రెడ్డి తెలిపారు.
ఉద్యోగులకు సీఎం భరోసా..
3 గంటల పాటు జేఏసీలోని ప్రతి మెంబర్ మాట్లాడేందుకు సీఎం అవకాశం ఇచ్చా రు. 317 జీవోపై ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ నివేదికపై జేఏసీ తరఫున సలహాలు, సూచనలు, అభ్యంతరాలు చెప్పాలన్నారు. ఆర్థిక భా రం పడే అంశాలపై డిప్యూటీ సీఎం, అధికారులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఈ చర్చలతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. జేఏసీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు.
మారం జగదీశ్వర్, జేఏసీ చైర్మన్
సీఎం నుంచి స్పష్టమైన హామీ..
ఉద్యోగుల సమస్యలపై సీఎంకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. సీఎస్, ఫైనాన్స్, జీఏడీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో చర్చలు జరగడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఏర్పడింది. ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. పెండింగ్డీఏలపై శుక్రవారం సాయంత్రం వరకు నిర్ణయం వెల్లడిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
పెండింగ్ ప్రమోషన్లు, ఎన్నికల బదిలీలను క్లియర్చేయడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. టీచర్లు, డాక్టర్లు, లెక్చరర్ల సర్వీస్ రూల్స్ పై త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాల తరఫున సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నాం.
ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ కో చైర్మన్