హైదరాబాద్: దసరాలోపు కొత్త టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను సీఎం ప్రకటించారు. 1:3 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్లు పాలించి కేవలం ఏడు వేల టీచర్ పోస్టులనే భర్తీ చేసిందని అన్నారు. తాము పది నెలల వ్యవధిలో 11 వేల 62 టీచర్ కొలువులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కేవలం 56 రోజుల్లోనే రిజల్ట్ ప్రకటించామని గుర్తు చేశారు. అక్టోబర్ 9 న ఎల్బీ స్టేడియంలో డీఎస్సీకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని సీఎం చెప్పారు.
ALSO READ | TGSRTC: దసరాకు 5304 స్పెషల్ బస్సులు
తాము అధికారంలోకి వచ్చిన పది నెలల వ్యవధిలో 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే గ్రూప్–1 పలితాలు విడుదల చేయనున్నామని సీఎం చెప్పారు. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో గత ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసి వేసిందని, తాము వచ్చాక వాటిని తెరిపించామని అన్నారు. గ్రామీణ విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో పేరుకుపోయిన చెత్తనంతా ఊడ్చేస్తున్నామని వివరించారు.
100 సెగ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
రాష్ట్రంలోని 100 సెగ్మెంట్ల పరిధిలో రూ. 12,500 కోట్లు వెచ్చించి నిర్మించనున్నామని చెప్పారు. ఇప్పుడున్న గురుకులాలు పిట్టగూళ్లలా ఉన్నాయని, వాటిని వర్సిటీల తరహాలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం గ్రూప్ 1,2,3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా సంస్కరిస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేయనున్నట్టు సీఎం వెల్లడించారు