
సదాశివనగర్, వెలుగు : విజయ డెయిరీకి సీఎం రేవంత్‌రెడ్డి రూ. 100 కోట్లు విడుదల చేయడంపై గురువారం సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సీఎంను కలిసి శాలువతో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసన మండలి ఆవరణలో వివిధ జిల్లాల డెయిరీ అధ్యక్షులతో కలిసి సీఎంను సన్మానించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయ డెయిరీకి సమర్థులైన చైర్మన్, ఎండీలను నియమించామన్నారు.
విజయ డెయిరీ సమాఖ్యను లాభాల బాటలో నడిపించాలని సూచించారు. విజయ డెయిరీలో పాలు పోసి ప్రభుత్వ పథకాలను అందుకోవాలని రైతులకు సూచించినట్లు చైర్మన్ తెలిపారు. చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం అందించిన రూ. 100 కోట్లతో విజయ డెయిరీలను అభివృద్ధి చేసి పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతకుంట తిరుపతి రెడ్డి, జీఎం (పీఆండ్ఐ) మధుసూదన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవేందర్ రావు, ధర్మారెడ్డి, సోమ్ రెడ్డి, డెయిరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.