షరతులు లేకుండా వరద సాయం చేయండి

షరతులు లేకుండా వరద సాయం చేయండి
  • కేంద్ర బృందానికి సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి
  • రాష్ట్రంలో వరద నష్టం రూ.10,320 కోట్లు
  • రూల్స్​ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్​​ నుంచి ఒక్క రూపాయి వాడుకోలేం 
  • కిలో మీటరు రోడ్డు డ్యామేజీకి లక్ష ఇస్తే టెంపరరీ రిపేర్లు కూడా కావు..
  • కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని సడలించాలి
  • మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్​నిర్మాణం కోసం సహకరించాలి
  • మేడారం అడవుల్లో చెట్లు కూలడంపై శాస్త్రీయంగా స్టడీ చేయాలి
  • వరదలు వచ్చినప్పుడు బెటాలియన్లను వాడుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: భారీవర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి  విజ్ఞప్తి చేశారు. 

ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. ‘‘విపత్తు నిధుల వినియోగంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనల్ని సడలించాలి. 

ఇప్పుడున్న కండిషన్స్​ ప్రకారం.. రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా వాడుకునే పరిస్థితి లేదు’’ అని అన్నారు. 

ఒక కిలో మీటర్ మేర రోడ్డు దెబ్బతింటే  కేవలం ఒక లక్ష రూపాయలే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని,  ఆ మొత్తంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. 

రాష్ట్రంలో జరిగిన నష్టంతోపాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని సీఎం కోరారు.  

రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు  వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం  వరదల వల్ల రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం వివరించారు.

తనతోపాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల  భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 

పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయడంతో రైతులకు కోలుకోలేని నష్టం జరిగిందని అన్నారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు,  చెరువులు కొట్టుకుపోవడంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. 

రిటైనింగ్ వాల్​కు నిధులు కేటాయించాలి

ఖమ్మం పట్టణానికి మున్నేరువాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు  రిటైనింగ్ వాల్ నిర్మాణమే పరిష్కారమని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటా భరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. 

ఈ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవడం కన్నా.. నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు.

 వర్షపాతం, హీట్ వేవ్​ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని  కేంద్ర బృందానికి సీఎం సూచించారు. 

భవిష్యత్తులో తక్షణ సహాయక చర్యలకు బెటాలియన్లు

భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. 

ప్రతి బెటాలియన్​లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని చెప్పారు.  

మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన  సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం జరిగేదని సీఎం అభిప్రాయపడ్డారు. 

దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. 

అలాంటి సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడిపోయి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. 

భారీ వర్షాలతో, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్​ కేపీ సింగ్​ సారథ్యంలో ని ఈ బృందంలో శాంతినాథ్​ శివప్ప, మహేశ్​కుమార్​, నాయల్​ కాన్సన్​, రాకేశ్​​ మీనా, శశివర్ధన్​రెడ్డి ఉన్నారు. 

శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తదితరులు ఉన్నారు. 

భారీ వర్షాలు, వరదల నష్టం అంచనా వివరాలు 

శాఖ పేరు      నష్టం అంచనా
    (రూ.కోట్లలో)
రోడ్లు (ఆర్​ అండ్​ బీ, పంచాయతీరాజ్​)    7,693.53
అర్బన్​ డెవలప్​మెంట్​    1,216.57 
ఇరిగేషన్​    483.00
డ్రింకింగ్​ వాటర్​ సప్లై మిషన్​ భగీరథ    331.37
అగ్రికల్చర్​ పంటల నష్టం    231.13
విద్యుత్​    179.88
కమ్యూనిటీ అసెట్స్​ అండ్​ బిల్డింగ్స్​    70.47
(పీహెచ్ సీలు, అంగన్​వాడీలు)
ఫిషరీస్​    56.41
స్కూల్​ బిల్డింగ్స్​    27.31
హౌసింగ్​    25.30
పశుసంవర్ధక శాఖ    4.35
మృతులకు    1.40