హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి :  సీఎం రేవంత్ రెడ్డి
  • కేంద్ర మంత్రి ఖట్టర్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • గ్రేటర్ పరిధిలోని ప్రాజెక్టులకుఫండ్స్ ఇవ్వాలని వినతి
  • ప్రతిపాదిత ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
  • తెలంగాణ అభివృద్ధికి అన్నివిధాలాసహకరిస్తామన్న కేంద్రమంత్రి
  • దావోస్ ఒప్పందాలపై సీఎం రేవంత్​కు ప్రశంసలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూ.55,652 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రి మనోహర్​లాల్ ఖట్టర్​ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం భూభాగం అర్బన్ ఏరియా కింద ఉందని,  గ్రేటర్ హైదరాబాద్ సహా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బేగంపేట ఐటీసీ కాకతీయలో అర్బన్ సెక్టార్, పవర్ సెక్టార్​లపై కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్​లాల్ ఖట్టర్ రివ్యూ చేపట్టారు.

ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అటెండ్ అయ్యారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మున్సిపల్  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మున్సిపల్ శాఖ, హైదరాబాద్ అభివృద్ధిపై నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ను ఖట్టర్ తిలకించారు. 

లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

తెలంగాణను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన అర్బన్ మొబిలిటీ (హెచ్ సిటీ, ఎలివేటెడ్ కారిడార్స్, మెట్రో కనెక్టివిటీ ఈస్ట్ వెస్ట్ కారిడార్, ట్రిపుల్ ఆర్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్), మూసీ రివర్ ఫ్రంట్  డెవలప్​మెంట్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్ (సరస్సుల పునరుజ్జీవనం, వాటర్ సెక్యూరిటీ సిటీ), భూభారతి చట్టం, మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ ప్లాన్ 2050 , బిల్డ్ నౌ, టౌన్​షిప్ గ్రోత్ సెంటర్స్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. 

ఇందుకు గానూ.. మెట్రో రైల్ ఫేజ్– 2కు రూ.24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా కోసం ఉద్దేశించిన సివరేజీ మాస్టర్ ప్లాన్ కు రూ.17,212 కోట్లు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కు రూ.4,170 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అటల్ మిషన్ ఫర్ రెజ్యూవే నేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ ఫండ్, స్వచ్ఛభారత్ మిషన్ 2.0,  స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్, స్మార్ట్ సిటీ మిషన్, పీఎం స్వానిధి కేంద్ర సౌజన్య పథకాల ప్రగతిని వివరించిన సీఎం.. పెండింగ్ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 

20 ల‌‌‌‌క్షల ఇండ్లు మంజూరు చేయండి: మంత్రి పొంగులేటి

తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్ ను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. గ‌‌‌‌త ప్రభుత్వం గృహ‌‌‌‌నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పదేండ్లలో రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణం జరగలేదన్నారు. దీంతో ఇండ్ల కోసం పేదల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స‌‌‌‌ర్వే ప్రకారం రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు సుమారు 44 ల‌‌‌‌క్షల వ‌‌‌‌ర‌‌‌‌కు ఉన్నారని, తమ ప్రభుత్వం పేద‌‌‌‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. వ‌‌‌‌చ్చే నాలుగేండ్లలో 20 ల‌‌‌‌క్షల ఇండ్లు నిర్మించాల‌‌‌‌ని ల‌‌‌‌క్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల‌‌‌‌తో వేగ‌‌‌‌వంత‌‌‌‌మైన ప‌‌‌‌ట్టణీక‌‌‌‌ర‌‌‌‌ణ జ‌‌‌‌రుగుతోందని, 26 జిల్లాల్లోని 6,867 గ్రామాల‌‌‌‌ను ఇటీవల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కిందికి తీసుకొచ్చామని తెలిపారు. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో చేర్చాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజ‌‌‌‌న పేజ్ -1లో దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరు కాగా.. తెలంగాణ‌‌‌‌కు 1.58 ల‌‌‌‌క్షల ఇండ్లు మాత్రమే మంజూర‌‌‌‌య్యాయని, ఇది మొత్తం మంజూరులో 0.79 శాతం మాత్రమేనని మంత్రి పొంగులేటి కేంద్రమంత్రికి గుర్తుచేశారు. హైదరాబాద్​లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ నిర్వహణ క్లిష్టతరంగా మారిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో లైన్ విస్తరణకు సహకరించాలని మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి ఖట్టర్​కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తం: ఖట్టర్

సీఎం రేవంత్​, ఇతర ఉన్నతాధికా రులు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలను పరిశీలించి.. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి ఖట్టర్  చెప్పారు. అలాగే, దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన ఒప్పందాలపై సీఎం రేవంత్​ని ఆయన అభినందించారు. రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.