బడ్జెట్‎లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్‎లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్

బడ్జెట్‎లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్‎లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‎ను శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‎పై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. 

కేంద్రం పట్టించుకోని తెలంగాణ ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో పెద్దపీఠ వేశారని.. మిగిలిన రాష్ట్రాలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. 

ALSO READ | తెలుగు కోడలు నిర్మలమ్మకు.. తెలంగాణపై ప్రేమ లేదు.. కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణకు గాడిద గుడ్డు


కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఆశించి భంగపడ్డ అంశాలివి:

* కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులు ఆశించి తెలంగాణ భంగపడింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణకు బడ్జెట్లో నిధులు ఆశించగా నిరాశే మిగిలింది.

* ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు దక్కాల్సిన నిధులను ప్రభుత్వం ఆశించగా కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.

* గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన ఉంచింది. హైదరాబాద్ నగరంలో తాగునీటికి రానురానూ డిమాండ్ పెరుగుతుందని, గోదావరి జలాలను తరలించడంతో పాటు మూసీ నది జలాలను శుద్ధి చేస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుందని కేంద్రానికి ప్రభుత్వం తెలిపింది. ఈ అంశాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు.

*హైదరాబాద్‌‌ చుట్టూ రీజినల్​రింగ్​రోడ్డు (ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌)కు చేయూత, మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కేంద్రం ఈ ప్రతిపాదనలను పెడ చెవిన పెట్టింది.

* ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌‌‌‌ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) నిధులు వస్తాయి. ఇవి దేశంలోని ప్రతీ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందేవే. కొత్తగా తెలంగాణకంటూ కేంద్రం బడ్జెట్లో చేసిన మేలు ఏం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా.