
- 60 ఏండ్లపాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ
- ఆ అప్పుల కిస్తీలకే మేం 1.58 లక్షల కోట్లు అప్పు చేసి రూ.1.53 లక్షల కోట్లు కట్టినం
- రాష్ట్రాన్ని దివాలా తీయించి.. ఇప్పుడు ఇష్టమున్నట్లు మాట్లాడ్తున్నరు: సీఎం రేవంత్‌రెడ్డి
- కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్లు రూ. 74,590 కోట్ల అప్పు తెస్తే.. మేం 5,643 కోట్లు కట్టినం
- వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అప్పు రూ.14,060 కోట్లయితే.. దాన్ని 12,816 కోట్లకు తగ్గించినం
- భగీరథ అప్పు 20,200 కోట్లలోమేం రూ.3 వేల కోట్లు చెల్లించినం
- లెక్కలన్నీ పక్కాగా ఉన్నయ్.. మాజీ మంత్రి హరీశ్ నోట్ చేసుకోవాలి
- పదేండ్లలో చేయలేని పనులు పది నెలల్లో మేం చేస్తుంటే కండ్లలో నిప్పులు పోసుకుంటున్నరని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల కుప్పగా బీఆర్ఎస్ తయారు చేసిపెట్టిందని, ఇదే వాళ్లు ఎలగబెట్టిన కార్యం అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘వాళ్లు సాధించిన అభివృద్ధి ఏందో .. వాళ్లు ఎలగబెట్టింది ఏందో.. ఆ ఎలుగబెట్టుడుతోని తెలంగాణ వెలిగింది ఏందో ..! వాళ్లకే తెలియాలి. 60 ఏండ్లలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు రూ. 90 వేల కోట్లయితే.. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ పదేండ్లలో చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు, కొనసాగుతున్న పనులకు సంబంధించి కలిపితే అది రూ.8.19 లక్షల కోట్లు. 60 ఏండ్లలో చేసిన అప్పు కన్నా అది నాలుగు రెట్లు ఎక్కువ” అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దివాలా తీయించిందని, వాళ్లు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను తాము నానా తిప్పలు పడి సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాదూ కూడదు అంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తాము లక్షా 52వేల కోట్లు అప్పు చేశామని హరీశ్‌రావు అంటున్నారని.. ఆ అప్పు చేసింది వాళ్లు చేసి అప్పులకు కిస్తీలు కట్టడానికేనన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘ఇంకొక లెక్క కూడా చెప్త. గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన (హరీశ్ రావు ) మేం రూ. లక్షా 52వేల కోట్లు అప్పులు చేసినం అంటున్నడు. ఔను.. మేం వచ్చినంక 15 నెలల్లో రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినం. నేను తక్కువఅప్పు చేసినమని చెప్పట్లేదు.. ఎక్కువనే చేసినం. ఈ అప్పు ఎందుకు చేసినం? వీళ్లు (బీఆర్ఎస్) చేసిన అప్పుల్లో అసలుకు రూ.88,591 కోట్లు కట్టిన. మిత్తికి రూ. 64,768 కోట్లు కట్టిన. అంటే ఈ 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.58 లక్షల కోట్లయితే.. బీఆర్ఎస్ వాళ్లు చేసిన అప్పులకు కట్టింది రూ.1.53 లక్షల కోట్లు. వాటికి పోను మిగిలింది రూ. 4,682 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి మాత్రమే” అని సీఎం పేర్కొన్నారు.
గొర్రెలు బాగా పెంచినమన్నరు కదా..? ఎక్కడ?
తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌ను గత బీఆర్ఎస్ సర్కార్ రూ.907 కోట్ల అప్పుతో తమకు అప్పజెప్తే ఇయ్యాల రూ.214 కోట్లకు అప్పు తగ్గించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘గొర్రెలు, బర్రెలు బాగా పెంచినమని వాళ్లు అంటున్నరు కదా? వాళ్లకే తెలియాలి. ఈ గొర్రెల పేరు మీద వీళ్లు చేసిన స్కామ్ వల్ల మా ప్రభుత్వం రూ.692 కోట్లు చెల్లించాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. ‘‘ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.125 కోట్ల అప్పుతో అప్పచెప్తే ఈ రోజు అప్పు రూ. 56 కోట్లు ఉంది. దానికి రూ.69 కోట్ల నేను కట్టిన. తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.132 కోట్ల అప్పుతో అప్పచెప్తే ఇప్పుడు రూ.79 కోట్లు ఉంది. రూ. 53 కోట్లు చెల్లించినం” అని ఆయన వివరించారు.
బీఆర్ఎస్ అప్పజెప్పిన అప్పులు ఇవీ!
ఎఫ్ఆర్బీఎం పరిధిలో, కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్లే చెల్లించేలా, కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీ.. ప్రభుత్వమే చెల్లించడం ద్వారా, ఎలాంటి ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే సొంతంగా చేసుకోవడం ద్వారా.. ఇలా నాలుగు రకాలుగా అప్పులు చేసే వెసులుబాటు ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడ్డ రోజు తెలంగాణ అప్పు ఎఫ్ఆర్బీఎం పరిధిలో రూ.72,658 కోట్లు. స్పెషల్ వెహికల్ పర్పస్ లోన్లు రూ.11,609 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలు తీసుకుని కార్పొరేషన్లు కట్టే అప్పులు రూ. 5,893 కోట్లు. ఈ మూడు కలిపితే రూ. 90,161 కోట్లు. ఆనాడు ఉన్న అప్పు ఇది. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్తే పదేండ్లలో వాళ్లు చేసింది 2023 డిసెంబర్ 11 నాటికి.. ఆ నాలుగు కేటగిరీల్లో కలిపి రూ.6 లక్షల 69 వేల కోట్లకుపైనే. ఇందులో ఎఫ్ఆర్బీఎం పరిధిలో రూ. 3,87,100 కోట్లు.. కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్లే చెల్లించేలా రూ. 1,27,209 కోట్లు.. కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వమే చెల్లించేలా రూ. 95,461 కోట్లు.. ఎలాంటి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా రూ. 59,414 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులే కాకా.. వీళ్లు ఇచ్చిపోయింది ఏందంటే పెండింగ్ పేమెంట్లు! అభివృద్ధి చేసినం.. అభివృద్ధి చేసినం అని ఏదైతే చెప్తున్నరో వీళ్లు చేసిన అభివృద్ధి ఏందంటే పెండింగ్ బిల్లులు, . సర్పంచ్‌లు ధర్నాలు చేస్తున్నరంటే వీళ్లు పెండింగ్ బిల్లులు చెల్లించకనే కదా?!
పెండింగ్ బిల్లులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.40,154 కోట్లు ఉన్నాయి. ఉచిత కరెంట్ కింద విద్యుత్ శాఖకు, సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్, డిస్కం ఎనర్జీ డ్యూస్, సింగరేణి పవర్ డ్యూస్ , ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బ్యాక్‌లాక్ పేమెంట్స్ కలిపితే మరో రూ. 1,09,740 కోట్లు. మొత్తంగా అన్ని రకాలుగా వాళ్లు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఉన్న అప్పు రూ.8,19,151 కోట్లు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మొత్తంగా రూ.27,209 కోట్ల అప్పుతోని 18 కార్పొరేషన్లు తమకు అప్ప చెప్తే ఈ రోజు వాటికి ఉన్న అప్పు రూ.17,109 కోట్లని.. తాము ఈ 15 నెలల్లో రూ.10,100 కోట్లు కట్టామని వివరించారు. ‘‘ఇంకా అయిపోలేదు. స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.56,146 కోట్లు అప్పు ఉంటే.. ఇప్పుడు రూ.57,824 కోట్లు ఉన్నది. ఆన్ టైంలో మేం చెల్లించినం.. అందుకే అదనంగా మేం చేసిన అప్పు రూ.1,728 కోట్లు. టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌ను రూ.1,270 కోట్లతో అప్పజెప్తే ఇప్పుడు రూ.735 కోట్లు ఉంది. రూ.535 కోట్లు మేం తిరిగి చెల్లించినం. జీహెచ్ఎంసీని రూ.1332 కోట్లతో అప్పజెప్తే.. ఈ రోజు రూ.1,086 కోట్లు ఉంది. రూ.246 కోట్లు చెల్లించినం. డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ను రూ.103 కోట్లతో అప్పుతో అప్పజెప్తే ఈరోజు రూ.129 కోట్లు అయింది.. రూ. 26 కోట్ల ఇక్కడ పెరిగింది. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.12,544 కోట్లతో అప్పజెబితే రూ.17,200 కోట్లు అయింది. ఇక్కడ రూ.4 వేల కోట్లు అదనంగా అప్పు చేసినం. అప్పులు అప్పులు అని వీళ్లు(బీఆర్ఎస్ వాళ్లు) మాట్లాడే ముందు ఈ లెక్కలు చూసుకుంటే తెలుస్తది. ఎందుకు చేశామో” అని పేర్కొన్నారు. ‘‘పదేండ్లలో చేయలేని అభివృద్ధి పనులు పది నెలల్లో మేం చేస్తే.. కండ్లలో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే బదులు.. యువకుడివైనా బాగా చేశావని, ఇంకా కష్టపడు అని అనుభవంతో ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే గౌరవిస్తం. కానీ, ఒక్కరోజైనా ఆయన మాట్లాడుతున్నరా?” అని కేసీఆర్ తీరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
హరీశ్.. మేం ఎంతకట్టినమో లెక్క చెప్త.. నోట్ చేసుకో
బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో దేనికి తాము ఎంత చెల్లించామో మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నోట్ చేసుకోవాలని, ఆయనకు కాపీ కూడా పంపుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద రూ. 74,590 కోట్లు బీఆర్ఎస్ వాళ్లు అప్పు తెచ్చి తమకు అప్పజెప్తే.. ఈ రోజు ఆ అప్పు రూ.68,947 కోట్లు తగ్గిందని, తాము ఆ కూలిపోయిన కాళేశ్వరానికి అప్పు కింద రూ. 5,643 కోట్లు కట్టామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ‘‘తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.14,060 కోట్ల అప్పుతో వాళ్లు మాకు అప్పు అప్పగిస్తే.. ఫిబ్రవరి 28 నాటికి ఉన్న అప్పు రూ.12,816 కోట్లు. వాళ్లు చేసిన దాంట్లో మేం రూ.1,244 కోట్లు చెల్లించినం.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథ అని గొప్పలు చెప్తుంటరు కదా.. దానికి వాళ్లు చేసిన అప్పు రూ. 20,200 కోట్లు. దాన్ని రూ. 17,200 కోట్లకు తగ్గించినం. నేను, మా భట్టి విక్రమార్క రూ.3 వేల కోట్లు చెల్లించడంతోనే అది తగ్గింది. అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పై వాళ్లు అప్పజెప్పిన అప్పు రూ. 6,470 కోట్లు ఉంటే.. ఈ రోజు రూ.5820 కోట్లు ఉన్నది. మా ప్రభుత్వం రూ. 650 కోట్లు కట్టింది. టీజీ రోడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్లు రూ.2,951 కోట్లు అప్పు చేస్తే.. ఇయ్యాల రూ.2, 646 కోట్లు ఉన్నది. రూ. 305 కోట్లు తిరిగి చెల్లించినం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డును రూ. 2,352 కోట్లు అప్పుతో అప్పజెప్తే ఈరోజు రూ.1830 కోట్లు మాత్రమే అప్పు ఉంది. రూ. 522 కోట్లు చెల్లించినం. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రూ.286 కోట్లు అప్పు చేస్తే ఈరోజు రూ.263 కోట్లు ఉంది. 23 కోట్ల కట్టినం” అని సీఎం లెక్కలతో వివరించారు.