హైదరాబాద్: ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించింది తెలంగాణ. ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జనవరి 28) మీడియాకు వెల్లడించారు.
సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు మొత్తం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఇంకా ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మా ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలే నేడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు రావడం మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అతిపెద్ద విజయమన్నారు.
ALSO READ | ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం.. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
పెట్టుబడులు తీసుకురావడం కొత్తేమి కాదని.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్ మెంట్లు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని.. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని ఫైర్ అయ్యారు. కానీ ఇన్వెస్టర్లు తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకున్నారన్నారు. రాజకీయంగా విధానాలను విభేదించినా సరే.. కానీ రాష్ట్ర ప్రజయోనాల విషయంలో రాజకీయాలు చేస్తే ఉపేక్షించబోమని ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.
పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నామని.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామమని రేవంత్ రెడ్డి అన్నారు.