జిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్​ ప్లాన్ హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం

జిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్​ ప్లాన్ హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం
  • కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం
  • ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించినం
  • మిషన్ కాకతీయతో చెరువులను పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నయ్?   
  • పువ్వాడ అజయ్ ఆక్రమణలతోనే ఖమ్మం మునిగింది.. హరీశ్.. ఆ ఆక్రమణలన్నీ తొలగించు 
  • వరద బాధితులకు కేంద్రం నుంచి సగం పరిహారం ఈటల ఇప్పించాలి
  • కేటీఆర్ ​అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఫైర్ 
  • ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన 
  • చనిపోయిన సైంటిస్ట్ అశ్వినీ కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ 


ఖమ్మం/మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతోనే కాలనీలను వరద ముంచెత్తుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ముందుగా నీళ్ల దగ్గరకు వెళ్లి నిర్మాణాలు చేస్తే, ఇప్పుడు నీళ్లు నిర్మాణాల్లోకి వస్తున్నాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులు ఉండేవి. వాటికి వర్షపు నీరు వెళ్లే మార్గాలను మూసివేయడం వల్లే భారీ నష్టం జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు కబ్జాకు గురయ్యాయి. మేం అధికారంలోకి రాగానే వాటి పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడ్తున్నాం. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణలను గుర్తించి తొలగిస్తాం’’ అని సీఎం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్​లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో సైతం అక్కడి పరిస్థితులను బట్టి కలెక్టర్లు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతానికి ఇతర జిల్లాలకు హైడ్రాను విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి క్యాంప్​ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వరద నష్టంపై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహబూబాబాద్ కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మానుకోట జిల్లా కేంద్రంలోనూ అనేక చెరువులు కబ్జాకు గురైనట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎంతటి వారైనాసరే కబ్జాదారులను ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ప్రకృతిని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని వదిలిపెట్టదని హెచ్చరించారు. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. 

మున్నేరు రిటైనింగ్ ​వాల్​ ఎత్తు పెంపు?  

ఖమ్మం జిల్లాలో ఒక్క రోజులోనే 42 సెంటీమీటర్ల వర్షం పడిందని, గత 75 ఏండ్లలో ఇంతటి వర్షం పడలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతటి విపత్తు సంభవించినా ప్రాణ నష్టం తగ్గించగలిగామంటే, అది ప్రభుత్వ ముందుచూపు వల్లే సాధ్యమైందని తెలిపారు. ‘‘ఈ విషయంలో పక్క రాష్ట్రం కంటే మనం ఎంతో బెటర్. ఖమ్మం జిల్లా పక్కనే ఉన్న ఇతర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కానీ మన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఆ విషయం కనిపించడం లేదు” అని మండిపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల వల్లే  నష్టం చాలావరకు తగ్గిందన్నారు. ‘‘మేం అధికారంలోకి రాగానే రూ.650 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్ కు టెండర్లు పిలిచాం. 33 అడుగుల ఎత్తు ఉండేలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతకంటే ఎత్తులో వరదలు వచ్చినందున ఇంజినీర్లతో చర్చించి, సాంకేతికంగా స్టడీ చేసిన తర్వాత ఎత్తు పెంపుపై నిర్ణయం తీసుకుంటాం” అని వెల్లడించారు. మానుకోట జిల్లాలోనూ ఒకేరోజు 28సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని.. దీంతో 45 చెరువులు, కుంటలు తెగి, వాగులు ఉప్పొంగడం వల్లే  హైలెవెల్ బ్రిడ్జిలు, రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ‘‘వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రకటించాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తాం” అని తెలిపారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున పంట నష్టపరిహారం ప్రకటించి ఇవ్వకుండా మోసం చేస్తే, తమ ప్రభుత్వం వచ్చాకే రూ.18 కోట్లు రిలీజ్​చేశామని గుర్తుచేశారు. ‘‘వర్షాల కారణంగా జరిగిన నష్టంపై అంచనాలు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పూర్తి నివేదికలు అందిన తర్వాత నష్టపరిహారంపై చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక ఉపశమన చర్యల కోసం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రకటించాం” అని తెలిపారు. 
  
ఈటల.. కేంద్రం నుంచి 50 శాతం పరిహారం ఇప్పించు   

ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభ విస్తే జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో నష్టం జరిగినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశామని, ఇంకా అక్కడి నుంచి స్పందన రాలేదని చెప్పారు. ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామన్నారు. లేకపోతే కేంద్రాన్ని కలుస్తామన్నారు. ‘‘రూ.5,438 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపించాం. రూ.2వేల కోట్లు తక్షణ సాయం చేయాలని ప్రధానిని కోరాం. వరదల వల్ల మృతి చెందినోళ్ల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆయన రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇప్పిస్తే, మరో రూ.25 లక్షలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. 50 శాతం పరిహారం కేంద్రం నుంచి ఈటల తీసుకురావాలి” అని సూచించారు.  

హరీశ్.. పువ్వాడ ఆక్రమణలు తొలగించు  

మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ ఆక్రమణల కారణంగానే ఖమ్మానికి వరద సమస్య వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి​ చెప్పారు. ‘‘వరదలపై మాట్లాడుతున్న హరీశ్ రావు.. ముందుగా ఖమ్మంలో అజయ్ ​మమత మెడికల్ కాలేజీ కోసం సాగర్​ కాల్వలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించాలి. పెద్ద మనిషిగా హరీశ్ రావు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేద్దాం.. అజయ్​ఆక్రమణలపై తేల్చాలి.. ఆక్రమణలను హరీశ్​రావు స్వయంగా తొలగించి ఆదర్శంగా నిలవాలి’’ అని సూచించారు. గత ప్రభుత్వంలో చెరువుల్లో మట్టిని అమ్ముకునేందుకు మిషన్ కాకతీయ చేపట్టారని విమర్శించారు. మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయగా మారిందని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశామని బీఆర్ఎస్​ లీడర్లు చెప్పారని.. మరి గతంలో తెగని చెరువులు ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని ప్రశ్నించారు. 

వేల మందిని గమ్యస్థానాలకు చేర్చినం: పొంగులేటి

భారీ వర్షాల కారణంగా ట్రాక్​లు దెబ్బతిని, రైళ్లు ఆగిపోతే సుమారు 17 వేల మంది ప్రయాణికులకు ఆహారం, నీరు అందించి, వసతి కల్పించి, వారిని గమ్యస్థానాలకు తరలించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భారీ వరదలు వచ్చినా ఆఫీసర్లు అలర్ట్​గా ఉండడం వల్లే మహబూబాబాద్​జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గిందని.. ఇందుకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం ద్వారా భరోసా కల్పిస్తున్న సీఎం రేవంత్ కు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్పారు. 

ఆఫీసర్ల కృషి మరువలేనిది: సీతక్క 

మహబూబాబాద్​జిల్లాలో వరద నష్టాన్ని తగ్గించడంలో జిల్లా అధికారుల కృషి మరవలేనిదని మంత్రి సీతక్క కొనియాడారు. భవిష్యత్తులో వరద నష్టాన్ని మరింత తగ్గించేందుకు అన్ని విభాగాలతో ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ నియమిం చాలని సూచించారు. జిల్లాలో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట, రోడ్లు, చెరువుల నష్టం వివరాలను పక్కాగా సేకరించాలన్నారు.

జనం కష్టాల్లో ఉంటేకేసీఆర్ ఎక్కడ?

ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యత గల ప్రభుత్వంగా మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. కానీ ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదు. అందుకే ఆయన ఫామ్ హౌస్​కు పరిమితమయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేండ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి వెళ్లలేదు. ట్రైన్ యాక్సిడెంట్​లో చిన్నారులు చనిపోయినా చలించలేదు. గతంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం, దహనం జరిగినా స్పందించలేదు. అసలు రాష్ట్రంలో కేసీఆర్​ జాడలేదు. ఆయనను చూసి చాలా రోజులైంది. ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వరద కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ట్విట్టర్​లో  రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు.
-