బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీల ఎంపికలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాన్నారు. ఎక్సైజ్ శాఖపై ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్,పలువురు అధికారులతో కలిసి రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ (TGBCL) కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలని చెప్పారు. ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని రేవంత్ అధికారులకు సూచించారు.
హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ చెప్పారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని రేవంత్ ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు.