నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ :సీఎం రేవంత్

నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ :సీఎం రేవంత్
  • ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు
  • పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో నిర్మిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు నిర్మిస్తామని చెప్పారు. వీటిని 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని.. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో క్యాంపస్ లు నిర్మిస్తామని వెల్లడించారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత  అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ల నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్ లు రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా, అన్ని సౌలతులు ఉండేలా అత్యాధునిక బిల్డింగులను నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని, స్థలాలు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇంటర్నేషనల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌కు దీటుగా ఈ క్యాంపస్ లు ఉండాలన్నారు. కాగా,  గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌‌‌‌ హబ్‌‌‌‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని.. కుల, మత వివక్ష తొలగిపోతుందని భావిస్తున్నది. అదే విధంగా గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలుంటుందని 
ఈ ఆలోచన చేస్తున్నది. 

సీఎంకు టీచర్ల ధన్యవాదాలు.. 

వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భాషా పండితుల, పీఈటీ టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ స్కూళ్ల టీచర్లు 11 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు.

 10 వేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, డిప్లమా కోర్సు మాత్రమే అర్హత కలిగిన భాషా పండితులను రివర్షన్ చేసి ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పని వేళలు పాత విధానంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్​ను కలిసిన వారిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, పీఆర్టీయూటీ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఆర్ యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్, నర్సింహులు పాల్గొన్నారు.