- ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షతోపాటు .. తులం బంగారం
- పెండ్లయిన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి
- ఇందుకోసం అంచనా బడ్జెట్ను రూపొందించండి
- అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కల్యాణమస్తు, షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెండ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం అంచనా బడ్జెట్ను రూపొందించాలని ఆఫీసర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం కూడా అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
శనివారం సెక్రటేరియెట్లో నిర్వహించిన రివ్యూలో దీనిపై అధికారులకు సీఎం రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. కల్యాణమస్తు పథకం కింద ఇచ్చే నగదు, బంగారం పెండ్లి అయిన వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు కూడా గ్రీన్ చానల్ కింద నిధులు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వం మాదిరి పెండ్లయిన ఏడాదికో, రెండేండ్లకో సాయం (కల్యాణలక్ష్మి) అందడం కాకుండా.. ఒకటి, రెండు నెలల్లోపే వధువు కుటుంబానికి సాయం(కల్యాణమస్తు) అందేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్యాణ మస్తు నగదుకు సంబంధించి చెక్కును అందివ్వడమా నేరుగా లబ్ధిదారు అకౌంట్కు బదిలీ చేయడమా అనేదానిపై సూచనలు చేయాలన్నారు. తులం బంగారం ఎలా అందించాలనే దానిపై కూడా నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు.