
హైదరాబాద్: ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చు అయిన వెనకాడమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ, విద్యా కమిషన్‌పై శుక్రవారం (ఏప్రిల్ 4) కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కేకే, విశ్రాంత ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. పాఠశాల విద్యలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు.
పలు దేశాలు, పలు రాష్ట్రాల్లోని విద్యా విధానాలను ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. పరీక్షల విధానం, విద్యా ప్రమాణాల పెంపుపై జయప్రకాష్ నారాయణ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు.
మంచి పాలసీ రూపాకల్పన కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడబోమని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపై వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి.. విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా సమగ్ర విధానం పత్రం రూపాందించాలని పేర్కొన్నారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలంగా ఉంటుందని అన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణిస్తారన్నారు.