- ఫైనల్ అయ్యాక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
- రేడియల్ రోడ్లు, డ్రైపోర్టు, గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సమీక్ష
- ఫోర్త్ సిటీలో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, వాటిలో పనిచేసే అధికారులు, సిబ్బంది, వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని సూచించారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై హైదరాబాద్ లో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో సీఎం పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు.
Also Read:-తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం
అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను సీఎం సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాలని, అది ఫైనల్ అయిన తర్వాత కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసమీకరణ వేగవంతం చేయాలి. భూసేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలి. ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలి. ప్రతి సమీక్షకు ప్రగతి కనపడాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను” అని సీఎం పేర్కొన్నారు.
నైట్ సఫారీలకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకు ఉన్న అటవీ ప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయన్నారు. ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. అమెరికాలోని యాపిల్ పరిశ్రమ అక్కడ యాపిల్ తోటలోనే ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాచకొండ పరిధిలోని లోయలు, ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ఈ రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) శ్రీనివాసరాజు, సీఎస్ శాంతి కుమారి, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, పీసీసీఎఫ్ డోబ్రియల్, టీజీఐసీసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ పైనా చర్చ
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూనిర్వాసితులతో సానుభూతిగా ఉండాలన్నారు. వారికి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వపరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో చూసి అలా చేయాలన్నారు. ఇక డ్రైపోర్టు నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఏపీ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రాధాన్యతలోకి తీసుకోవాలన్నారు.
ఇవన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రైలు, జలమార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలపగా.. ‘‘ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిది ఉందా? ఉంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది? ప్రతిపాదనలేనా, లేక వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందా అనే దానిపై స్టడీ చేసి సాధ్యమైనంత త్వరగా నాకు నివేదిక సమర్పించాలి” అని అధికారులను సీఎం ఆదేశించారు.