- ఎన్నికలప్పుడే రాజకీయాలు
- రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు: సీఎం రేవంత్
- ఎన్నికలప్పుడే రాజకీయాలు,రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు: సీఎం రేవంత్
- ఏపీలో కలిసిన 5 గ్రామాలను ఇవ్వాలని ప్రధానిని కోరినం: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నెల ఏడో తారీఖు నాటికి పీసీసీ చీఫ్‌గా తన పదవీకాలం మూడేండ్లు పూర్తవుతుందని, ఆలోపు కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ‘‘ఇప్పుడు బాల్ ఏఐసీసీ అధ్యక్షుడి కోర్టులో ఉంది.
అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. పీసీసీ చీఫ్ విషయంలో నాకు ఏకాభిప్రాయం ఉంది.. వేరేవాళ్లని నియమించండని నేను ఏఐసీసీ అధ్యక్షుడికి చెప్పిన” అని ఆయన వివరించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అంతకుముందు డిప్యూటీ సీఎంతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలు, పెండింగ్ప్రాజెక్టులు, రావాల్సిన నిధుల విషయాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తెచ్చామన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించిందని, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ చొరవ చూపాలని సీఎం రేవంత్ కోరారు. విభజన సమస్యల పరిష్కారంతోపాటు సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్, కీలకమైన ప్రాజెక్టులపై ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏపీలో కలిసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తోపాటు, 25 లక్షల ఇళ్లు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు. తమ విన్నపాలపై ప్రధాని, హోం మంత్రి సానుకూలంగా స్పందించారని భట్టి తెలిపారు.
ఇప్పుడు స్వేచ్ఛ ఫీలింగ్ ఉంది: కేకే
‘‘కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. సొంత పార్టీలోకి రాగానే ఇప్పుడు స్వేచ్ఛ ఫీలింగ్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నది. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేం. కానీ గడిచిన ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. గత ప్రభుత్వం ఫ్యామిలి పబ్లిసిటీ చేసుకుంది..” అని సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కంటే తాను రెండేండ్లు పెద్ద అని, దేశంలో గ్రేటెస్ట్ పార్టీల్లో కాంగ్రెస్ ఒకటని ఆయన తెలిపారు.
కేకేకు సలహాదారు పోస్టు ఇస్తాం
ఢిల్లీ పర్యటనలో భాగంగా కే.కేశవరావుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రితో సమావేశం అనంతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేత రోహిణ్‌రెడ్డితో కలిసి ఢిల్లీలోని కేకే ఇంటికి సీఎం వెళ్లారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన కేకే.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేకేతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌కు, రాష్ట్రానికి సీనియర్ నేత కేకే సేవలు ఎంతో అవసరమన్నారు. వారి సలహాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, కేబినెట్ ర్యాంక్‌తో ఆయనకు ప్రభుత్వ సలహాదారు పోస్టు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, తాము రెండోసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మూసీ అభివృద్ధి, ట్రిపుల్ ఆర్ నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకు ఆస్కారం ఇవ్వనని, రూల్స్ ప్రకారమే ముందుకు పోతామని ఆయన స్పష్టంచేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా టీచర్ల బదిలీలు జరిగాయని, పోలవరం ముంపు గ్రామాల విలీనం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన ముగియటంతో గురువారం అర్ధరాత్రి సీఎం, డిప్యూటీ సీఎం హైదరాబాద్ చేరుకున్నారు.