వరద బాధితులకు సీఎం రేవంత్​ రెడ్డి ఓదార్పు

వరద బాధితులకు సీఎం రేవంత్​ రెడ్డి ఓదార్పు
  •  వరద బాధితులకు సీఎం రేవంత్​ రెడ్డి ఓదార్పు..  ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటన

ఖమ్మం, వెలుగు: వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని ఆయన  భరోసా ఇచ్చారు. సోమవారం ఖమ్మంలోని మున్నేరు ప్రభావిత కాలనీల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు.

ముందుగా నాయకన్​ గూడెం దగ్గర పాలేరు కాల్వ పొంగడంతో తెగిపోయిన రహదారిని పరిశీలించారు. తర్వాత పాలేరు ఎడమ కాల్వకు గండిపడడంతో దాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్నారు. మున్నేరు వరదతో ముని గిపోయి నష్టపోయిన పోలేపల్లి, పెద్దతండా, బొక్కలగడ్డ కాలనీలను పరిశీలించారు. దెబ్బతిన్న ఇండ్లలోకి వెళ్లి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత ఖమ్మం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందని, 16 మంది ప్రాణాలు కోల్పో యారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. రోడ్లు, కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో విద్యుత్​ సబ్​ స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రాథమికంగా రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని తెలిపారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్​, నిర్మల్, నిజామాబాద్​ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం అం దిందని తెలిపారు. ప్రస్తుతం యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైందని, కొద్దిగా తెరపి ఇవ్వగానే పూర్తి స్థాయి నష్టం అంచనాలు వేస్తామని సీఎం తెలిపారు. 

Also Read :- పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు

కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి

రాష్ట్రంలో ఊహించని రీతిలో వచ్చిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రితో మాట్లాడినట్లు వివరించారు. ఏపీలో జరిగిన నష్టం కంటే ఖమ్మంలో జరిగిన నష్టమే అధికంగా ఉందని.. ఊహించని ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రూ.5,438 కోట్లను జాతీయ విపత్తు నిధుల నుంచి విడుదల చేయాలని కేంద్రానికి లేఖరాసినట్టు తెలిపారు.

ఆపద సమయంలో పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. నిధులివ్వడమే కాకుండా, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యటించాలని సీఎం కోరారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఇలాంటి కష్ట సమయంలో తమ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదని ఆయన చెప్పారు. 

కేటీఆర్​.. ఎంజాయ్​ చెయ్​.. బద్నాం చేయకు

తమకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి హుటాహుటిన వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేత షర్మిల కూడా ప్రజల్లోనే ఉన్నారు.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ ఫామ్​హౌస్​లో విశ్రాంతి తీసుకుంటూ, మౌన ముద్రలో ఉన్నారు. ప్రజలు సమస్యల్లో ఉంటే అవసరమైతే మా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత మౌన ముద్ర ఎందుకు? ఫ్రెండ్స్​తో కలిసి కేటీఆర్​ అమెరికాలో ఎంజాయ్​ చేస్తున్నడు. ఆయన ఫారిన్​ టూర్లు ఎంజాయ్​ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ఉన్న మా మంత్రులపై విమర్శలు చేయడం మానుకోవాలి” అని సీఎం అన్నారు. రాష్ట్రంలో వరద కష్టాలకు చలించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొంత సాయం ప్రకటించారని, అధికారంలో ఉన్న పదేండ్లలో లక్ష కోట్లు సంపాదించిన కల్వకుంట్ల కుటుంబం మాత్రం జనానికి చిల్లి గవ్వ సాయం చేయడం లేదని తెలిపారు.

రూ. వెయ్యి కోట్లో,  రూ.2 వేల కోట్లో వరద సహాయ కింద ప్రకటించి పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవాలని బీఆర్​ఎస్​కు సూచించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.  రెండు రోజులుగా రోడ్లమీద ఉండి సహాయక చర్యలు చేపట్టడం వల్లే ఇంత పెద్ద విపత్తును అధిగమించగలిగామని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారుల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని, వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేస్తామని మంత్రి  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత రోడ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రెండు మూడ్రోజుల్లో పంట నష్టం అంచనాలను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామన్నారు. 


మున్నేరు బాధితులకు తక్షణ సాయం రూ.10 వేలు

మూడు రోజుల కింద వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్​, డీజీపీ, డిజాస్టర్​ రెస్పాన్స్​ కమిషనర్​, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కంటిపై కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం బాధితులకు కల్పించేందుకు స్వయంగా ముంపు ప్రాంతా లకు వచ్చానని చెప్పారు. ‘‘ప్రజలు బాధతో ఉన్నారు. ఈ సమయంలో పర్యటనకు వద్దని కొందరు సూచించా రు.

కానీ, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడే అండగా ఉండాలన్న ఆలోచనతో వచ్చాను” అని సీఎం అన్నారు.  మున్నే రు వరద బాధితుల ఇండ్లను చూశానని, తమకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వర్షాన్ని, వరదను చూడలే దని 70, 80 ఏండ్ల వృద్ధులు చెప్తున్నారని సీఎం తెలిపారు. వాళ్లకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనని.. ఇండ్లలో టీవీ, ఫ్రిజ్​తో పాటు బియ్యం, ఉప్పు, పప్పులు మొత్తం కోల్పోయారని, వారికి తక్షణ ఉపశమనం కింద రూ.10 వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించామని సీఎం చెప్పారు.