
ఢిల్లీ వెళ్లారు.. ఢిల్లీ వెళ్లారు అంటూ బీఆర్ఎస్ పార్టీ పదేపదే కామెంట్స్ చేస్తుందని.. దేని కోసం ఢిల్లీ వెళుతున్నానో వాళ్లకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు 32 సార్లు ఢిల్లీ వెళ్లాను.. భవిష్యత్ లో 300 సార్లు వెళతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 3 సార్లు ప్రధాని మోదీని కలిశానని.. అందరు కేంద్ర మంత్రులను కలిశానని.. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా కలిసినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్లి ఊరికే తిరిగి రాలేదని.. ఢిల్లీ నుంచి సాధించింది ఎంతో ఉందన్నారు.
గోళీలు ఆడుకోవటానికి నేనేం ఢిల్లీ వెళ్లటం లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాల కోసం.. రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు, పనుల కోసం వెళ్లినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీలా ఢిల్లీకి వెళ్లి కేసుల మాఫీ గురించి.. చీకట్లో కాళ్లు పట్టుకోవటానికి వెళ్లలేదంటూ కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి చురకలు అంటించారాయన.
ఢిల్లీ వెళ్లిన తర్వాతే వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది నిజం కాదా.. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు టెండర్ల వరకు వచ్చింది నిజం కాదా అంటూ ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చారు. 4 వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పులు తీసుకొచ్చింది నేనే కదా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ల్యాండ్స్ ను సాధించింది నేనే కదా.. పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి సాధించలేనిది నేను సాధించానన్నారు. 160 ఎకరాల ఆర్మీ భూములను తెలంగాణకు అప్పగించారని.. దీనికి కృతజ్ణత చెబితే తప్పేంటీ అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించిన వాళ్లు ఎవరికైనా అభినందనలు చెబుతాం అన్నారు.
ALSO READ | కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు త్వరలోనే విప్పుతా : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిసి హ్యాండ్ లూం ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చానని.. వరంగల్ లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ పెండింగ్ నిధులను తీసుకొచ్చానని.. జహీరాబాద్ నిమ్స్ కు 12 వందల కోట్లు తీసుకొచ్చిన విషయాన్ని సభలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లటం వల్లే కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించానని.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ దిశగా వెళుతున్నాం అని.. మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. భారత్ సమ్మిట్ కు 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని.. తెలంగాణ రైజింగ్ కోసం చేస్తు్న్నాం అని.. ఇందు కోసం కేంద్రం నుంచి చాలా అనుమతులు రావాల్సి ఉందని.. దీని కోసమే ఢిల్లీ వెళుతున్నట్లు వివరించారాయన.