
- వచ్చే ఏడాది కేంద్రం జనగణన చేస్తుంది: రేవంత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనగణన చేసి 2027లో జనాభా లెక్కలను నోటిఫై చేసే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా లెక్కల సేకరణకు ఎంత ఖర్చు అవుతుందన్న వివరాలను కలెక్టర్లను కేంద్రం అడిగిందని పేర్కొన్నారు. శనివారం శాసనమండలిలో స్పీచ్ ముగిసిన తరువాత మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. జనగనణ వివరాల ప్రకారం కేంద్రం డీలిమిటేషన్ కు సమాయత్తమవుతున్నదని, అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా మా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఎన్నికల్లో గెలిచామని, ఇపుడు ప్రజలు నమ్మి మళ్లీ గెలిపిస్తారని, రెండో సారి తాను సీఎం అవుతానన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఇచ్చిన హామీలు ప్రతీ ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్తానని, సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లని సీఎం స్పష్టం చేశారు. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తానని అన్నారు. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా సమయానికి తమకే ఓటు వేస్తారన్నారు.