కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు త్వరలోనే విప్పుతా : సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు త్వరలోనే విప్పుతా : సీఎం రేవంత్ రెడ్డి

యువత కోసం.. యువత భవిష్యత్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తుందని.. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారంలో చేసిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఫాంహౌస్ పార్టీలను ప్రస్తావించారాయన. 

అప్పట్లో జన్వాడ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీలో ఎవరు దొరికారు.. మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన కోడి పందాలు, క్యాసినోలో ఎవరు దొరికారు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దుబాయ్ లో డ్రగ్స్ తీసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు.. దుబాయ్ లో మిత్రుడు చనిపోతే.. శవాన్ని కూడా తెలంగాణకు తీసుకురాకుండా.. దుబాయ్ వెళ్లి మరీ అంత్యక్రియలు చేయించి వచ్చిన చరిత్ర ఎవరిది అంటూ ప్రశ్నించారు. 
వీళ్లా యువత గురించి మాట్లాడేది అంటూ నిలదీశారాయన. 

Also Read : రొయ్యల పులుసు తిని.. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్ కాదా.?

దీపావళి పండుగ రోజు అందరూ టపాసులు కాల్చుతుంటే.. వీళ్లు మాత్రం ఫాంహౌస్ లో కొకైన్, డ్రగ్స్, మందు పార్టీలు చేసుకున్నారని.. డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేస్తే.. మా బామ్మర్ధి ఇంటికి వెళ్లారా అంటూ కేటీఆర్  అడుగుతున్నాడని.. డ్రగ్స్ పార్టీలు చేసుకుంటే పోలీసులు ఎందుకు వెళ్లకూడదని సభలోనే నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. నీ బామ్మర్ధి కళ్లల్లో ఆనందం కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు..అంతేకానీ తెలంగాణ గడ్డపై ఇలాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు, ఉపేక్షించదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

దుబాయ్ లో డ్రగ్స్ పార్టీలు చేసిన మొత్తం వ్యవహారం తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దుబాయ్ నుంచి మొత్తం రికార్డులు తెప్పించానని.. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమున్నాయో గుట్టంతా రికార్డుల్లో ఉందనర్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు గుట్టు రట్లు అన్నీ బయటకు వస్తాయని.. త్వరలోనే కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ బయటకు వస్తాయంటూ సంచలన విషయాలు అసెంబ్లీ సభలోనే వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.