నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు ​సీఎం రేవంత్​రెడ్డి ఓకే చెప్పారు: వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్​రెడ్డి అంగీకరించారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. నేతకాని కులస్తులకు రాజకీయంగా మంచి అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా నేతకాని కార్పొరేషన్​  ఏర్పాటుచేసి, నిధులు మంజూరు చేయాలని తాను సీఎంను కోరినట్లు చెప్పారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎంఆర్ఆర్​ గార్డెన్స్​లో జరిగిన నేతకాని సేవాసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, దుర్గం నరేశ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. నేతకాని సంఘం లీడర్ దుర్గం నరేశ్​ను వెంట తీసుకెళ్లి,  సీఎంను కలిసి, కులస్తుల  సమస్యలు, డిమాండ్లను ఆయన దృష్టికి తెచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. హైదారాబాద్ లో నేతకాని భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, వంశీ కృష్ణ ను గెలిపిస్తే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు సమీకరించుకునే చాన్స్​ ఉంటుందన్నారు. 

చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా నేతకాని భవనం కావాలని కోరారని, త్వరలోనే ఒక మంచి భవనాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 3న ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్​రెడ్డి నేతకాని కార్పొరేషన్​ను ప్రకటిస్తారని తెలిపారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితులను చిన్నచూపు చూస్తుందని తెలిపారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం పిలువలేదని అన్నారు. ఈ సందర్భంగా నేతకాని కులస్తులు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో నేతకాని సంఘం లీడర్లు దుర్గం వెంకట్ స్వామి, ఆకుదారి రాంబాబు, తాళ్ల బాపు, రాంటెంకి పోచం, జనగాం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల కోడ్​ ముగియగానే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.. 

ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్ హామీ​ఇచ్చిన డబుల్​బెడ్​ రూం​ ఇండ్లు ఏ ఒక్కరికీ రాలేదన్నారు. గ్రామాల్లో పదేండ్ల కిందట కాంగ్రెస్​సర్కారు​ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే  కనిపిస్తున్నాయని తెలిపారు. విశాక ట్రస్ట్​ ద్వారా వేసిన బోర్లే గ్రామస్తుల దాహార్తిని తీరుస్తున్నాయని అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా  చెన్నూరు మండలం దుగ్నెపల్లి, సుందరశాల, నర్సక్కపేట, పాగెపల్లి, ముత్తరావుపల్లి, పొక్కూర్​, రచ్చపల్లి, కొమ్మెర గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున  నిర్వహించిన  ఎన్నికల కార్నర్ ​మీటింగ్స్​లో వివేక్ వెంకటస్వామి పాల్గొని, మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్​ మాట ఇస్తే తప్పదని, పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతుందని అన్నారు. కౌలు రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 6 గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేసిందని తెలిపారు. చెన్నూరు మండలంలోని సుందరశాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, అన్ని విధాలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామాల్లో బోర్లు మంజూరు చేశానని తెలిపారు. 

వంశీ గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు

 పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపిస్తే ఈ  ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. వంశీకి మెజార్టీ వస్తే హైకమాండ్​ వద్ద దేని కోసమైనా అడిగే ధైర్యం ఉంటుందని చెప్పారు. కాకా వెంకటస్వామి పెన్షన్​ స్కీం తీసుకువచ్చాడని, ఆయనను పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతం నుంచి 4 సార్లు ఎంపీగా, తనను ఒక్కసారి ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, అన్నయ్య వినోద్​ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. కాకా కుటుంబం ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కాకా వెంకటస్వామి చూపిన బాటలో తన కుమారుడు గడ్డం వంశీకృష్ణ నడుస్తారని అన్నారు. బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​ మంత్రిగా ఉండి ఏమీ చేయలేదన్నారు. బీజేపీ అభ్యర్థి ఎప్పుడు పార్లమెంట్​ పరిధిలో తిరగలేదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం తాను కేంద్ర మంత్రి పదవిని తిరస్కరించానని తెలిపారు. ఎంపీలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాగాంధీకి వివరించానని చెప్పారు. మంత్రి పదవి తీసుకోవాలని సూచించినా తెలంగాణ రాష్ట్రమే తమకు అవసరం అంటూ చెప్పానని తెలిపారు. ఆయన వెంట మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి, బాపురెడ్డి, హిమవంతరెడ్డి, మైదం రవి, బండి సదానందం, భాస్కర్​రెడ్డి, సుశీల్, అంకాగౌడ్, రఘునందన్​రెడ్డి తదితరులున్నారు. 

కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుండు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్​ ​ఉంటే.. కేసీఆర్  10 ఏండ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చాడని వివేక్​ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కమీషన్లతోపాటు మిషన్​ భగీరథ స్కీమ్​లో రూ.45 వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లో వేల ఎకరాల పంటలు మునిగిపోతున్నాయని వెల్లడించారు. బ్యాక్​వాటర్​ బాధితులను తాము ఆదుకుంటామని చెప్పారు.  బాల్క సుమన్​ గ్రామాల ముఖం చూడలేదని, ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడంతో  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు  గట్టి బుద్ధి చెప్పారన్నారు.