![రాష్ట్రాలను గుప్పిట్లో ఉంచుకునేందుకు కేంద్రం ఎత్తులు : సీఎం రేవంత్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-said-southern-states-are-being-punished-at-the-cost-of-development-the_UsaqVz35GW.jpg)
హైదరాబాద్, వెలుగు: ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాడితేనే హక్కులను సాధించుకోవచ్చన్నారు.
ప్రశ్న: నదీ జలాలతో పాటు రాజకీయ, భౌగోళికపరమైన అంశాల్లో తేడాలపై దక్షిణాది రాష్ట్రాలు ఏవిధమైన వ్యూహం అవలంబించాలి..? ఏవిధంగా కలిసి సాగాలి..?
సీఎం రేవంత్‌రెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వాళ్లు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు.. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మనమంతా ఏకమవ్వడానికి ఇది సరైన సమయం..
కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటించాం.. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కోల్పోతాం. అందుకే.. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం సీట్లు పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించిన.
అలా చేస్తే ఉదాహరణకు కేరళలో ప్రస్తుతం 20 సీట్లు ఉన్నాయి. సీట్లు పెంచితే అదనంగా 10 సీట్లు వస్తాయి... తెలంగాణకు 17 సీట్లు ఉన్నాయి. అదనంగా 9 వస్తాయి... అలా చేయకుండా జనాభా దామాషా ప్రకారమే వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లో గెలిచే సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పని లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
ప్రశ్న: దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకు రెండున్నరేండ్లు జీఎస్టీ తిరిగి చెల్లించలేదు. మధ్యప్రదేశ్‌కు మొత్తం ఇచ్చారు.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విషయంలో రాష్ట్రాలను విస్మరిస్తున్నారు ? ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు సరైన దిశగా పునరుద్ధరించగలరు?
సీఎం: ఒకే దేశం .. -ఒకే ఎన్నికను మేం అంగీకరించం. జాతీయ స్థాయి ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు. తప్పనిసరైతే ఒకే రాష్ట్రం.. ఒకే ఎన్నిక చేపట్టవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, సహకార ఎన్నికలు ఒకేసారి చేపట్టవచ్చు. వాటిల్లో మనం అనేక రాజకీయ వాగ్దానాలు చేస్తాం. జాతీయ స్థాయి ఎన్నికలు.. రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు. రాష్ట్రం ఒక యూనిట్. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. ఆయన (ప్రధానమంత్రిని ఉద్దేశించి) రాష్ట్రాల ప్రాథమిక హక్కులను విస్మరించలేరు.
ఆయన రాష్ట్రాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యా రంగంలో కేంద్రం తెస్తున్న మార్పులను చూడండి. రానున్న రోజుల్లో మన యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను కేంద్రమే నియమించాలనుకుంటున్నది. వాళ్లకు(కేంద్రానికి) సెంట్రల్ యూనివర్సిటీలున్నా మన రాష్ట్రాల్లో మన నిధులతో, మన సంస్కృతితో సంబంధం ఉన్న యూనివర్సిటీలకు వాళ్లు వైస్ చాన్సలర్లను నియమించాలనుకుంటున్నారు. ఇది మన సంస్కృతిపై దాడి.
నదుల అనుసంధానంలో వారిది అదే విధానం. క్రమంగా ఒకదాని వెంట ఒకటి రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారు. రాజ్యాంగం ఇది కేంద్ర జాబితా.. ఇది రాష్ట్రాల జాబితా.. ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించింది. ప్రధాని మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలోనే ఉండాలనుకుంటున్నారు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలకు ఎప్పుడూ వాటి సొంత అజెండా ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు బాధ్యతయుతంగా ఉండాలనేది నా భావన. ఒకే దేశం.. ఒకే ఎన్నికకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అవసరం.
ప్రశ్న: మీ ప్రాంతానికే చెందిన పీవీ నర్సింహారావు సమర్థుడైన ప్రధానమంత్రి. కానీ, ఆయనకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు?
సీఎం: అది బీజేపీ.. నరేంద్రమోదీ.. వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన ఒక భావన. పీవీ కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన పీవీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రిని, సీఎంను, కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, ఏఐసీసీ అధ్యక్షుడ్ని చేసింది. బీజేపీకి ఎటువంటి లెగసీ లేదు. ఏఐసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావును కావాలనే కాంగ్రెస్ వ్యతిరేకులుగా బీజేపీ వాళ్లు ముద్ర వేస్తున్నారు.
వల్లభాయ్ పటేల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ ముద్ర వేస్తున్నారు. తాము వల్లభాయ్ పటేల్ వారసులమని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల వారికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కావాలనే బీజేపీ, నరేంద్ర మోదీ, వాట్సాప్ యూనివర్సిటీ అపోహలు సృష్టిస్తున్నది. ఆ మాయాజాలంలో పడొద్దు.