- గడీల ఆనవాళ్లు లేకుండా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్
- డిసెంబరు 9న లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో వేడుక
- మేధావుల సూచన మేరకే సెక్రటేరియెట్ఎదుట రాజీవ్ విగ్రహం
- సెక్రటేరియెట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
హైదరాబాద్, వెలుగు: తల్లిని తలపించేలా.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిపాలనకు గుండెకాయ వంటి సెక్రటేరియెట్ ప్రాంగణంలో డిసెంబరు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.
సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు అధికారంలో ఉన్న గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. దొరల గడీల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదని, అందుకే తెలంగాణ ప్రజల అభిమతానికి తగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ, జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించామన్నారు.
2014 నుంచి 2024 వరకు పదేండ్లు తెలంగాణను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పకున్నారని.. కానీ, తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. అన్ని సమస్యలను పరిష్కరించే సచివాలయంలోకే ప్రజలకు ప్రవేశం కల్పించలేదని మండిపడ్డారు.
పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు రాలే..
పదేండ్లలో రూ.22.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి ఖర్చుచేసి సెక్రటేరియెట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేదని సీఎం విమర్శించారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ చుట్టు పక్కల దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేద్కర్, ఇందిరా గాంధీ, అంజయ్య, పీవీ నరసింహా రావు, కాకా వెంకటస్వామి విగ్రహాలు, జైపాల్ రెడ్డి సమాధి ఉన్నాయని.. వీటి మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటుగా కనిపించిందని పేర్కొన్నారు.
సచివాలయం ఎదుట ప్రదేశాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉంచుకోవాలని కొందరు భావించారని.. కానీ, మేధావుల సూచన మేరకే తాము అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్రహానికి.. తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు కొందరు ప్రయత్నించారన్నారు.
సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009, డిసెంబరు 9న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని.. అదే రోజు సోనియా గాంధీ జన్మదినం కావడంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.