
- ప్రతిపక్ష నాయకుడు కాదు.. కమర్షియల్ వ్యాపారి
- రాష్ట్ర అవతరణనే ఆయనకు ఇష్టం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- అమరువీరుల ఆనవాళ్లే కేసీఆర్‌కు నచ్చవ్
- అధికారిక వేడుకలకే రానోడు అసెంబ్లీకి వస్తడా?
- పాకిస్థాన్ లెక్క ఒకరోజు ముందే వేడుకలు చేసుకుంటరా?
- కేటీఆర్ ఓ పిచ్చోడు.. కరెంట్ షాక్ పెడ్తే సక్కగైతడు
- విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీశ్‌రావు మనుషులున్నరు
- కరెంటుపై సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నరు
- సమ్మక్క, సారలమ్మను చంపింది కాకతీయులే
- మేం పీడిత ప్రజల కోసం పోరాడినోళ్లవైపే ఉంటం
- సెక్రటేరియెట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తం
- మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్‌కు వ్యాపారమని, ఆ పేరు మీద ఆయన లాభపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్ర అవతరణనే కేసీఆర్‌కు ఇష్టం లేదని, తెలంగాణ అంటే ఆయనకు గౌరవం లేదని అన్నారు. అధికారిక వేడుకలకే రాని వ్యక్తి.. అసెంబ్లీకి వస్తడా? అని ప్రశ్నించారు. అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడా? లేక కమర్షియల్ వ్యాపారా? అని ఫైర్అయ్యారు. శనివారం సాయంత్రం తన నివాసంలో సీఎం రేవంత్ చిట్‌చాట్‌గా మాట్లాడారు.
పాకిస్తాన్ మాదిరిగానే కేసీఆర్ కూడా ఒక రోజు ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అమరవీరుల స్థూపం, వారి కుటుంబాలు అంటేనే కేసీఆర్ కు ద్వేషమని, వారి ఆనవాళ్లు కూడా ఉండడం కేసీఆర్ కు నచ్చదని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
గన్ పార్కు వద్ద ఇనుప కంచెలు అంటూ కేటీఆర్ మతిలేని విమర్శలు చేస్తున్నారని, ఆయనో పిచ్చోడని మండిపడ్డారు. కేటీఆర్‌కు కరెంట్ షాక్ పెడితేనే సక్కగైతడని చురకలంటించారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నదని, గన్ పార్కు వద్దకు తాను వెళ్లాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని, పదేండ్లు పాలించినవారికి ఈ విషయం కూడా తెలియదా? అని ప్రశ్నించారు. గన్ పార్కు వద్ద తాను ఇనుప కంచెలు ఎలా పెట్టిస్తానని, అధికారులందరూ ఈసీ పరిధిలోనే ఉంటారని అన్నారు. ఈ వేడుకలకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో పాటు గవర్నర్ నుకూడా ఆహ్వానించినట్టు చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతల్లేవ్.. సరఫరాలో అంతరాయమే
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విద్యుత్తు కోతలు లేవని, కేవలం సరఫరాలో అంతరాయం మాత్రమే ఏర్పడుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలిపారు. విద్యుత్ శాఖలో ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఏజెంట్లు కొందరు ఉన్నారని, వారితో అక్కడక్కడా కరెంట్ సరఫరాలో కొంత ఇబ్బంది సృష్టిస్తున్నాడని ఆరోపించారు.
ఇటీవలే భూపాలపల్లి సబ్ స్టేషన్లో ఒక ఆపరేటర్ మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి పడుకున్నాడని, లాగ్ బుక్ లో వివరాలు తెలియకుండా వైట్నర్ పూశాడని తెలిపారు. అతడిని వెంటనే సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే ద్వారా తమకు తెలిసిందని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న లత్కోర్ పనులతోనే, ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కరెంట్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తాము ఇలాంటి చిల్లర పనులు చేయనందుననే నిరంతరం విద్యుత్తు సరఫరా అయిందని అన్నారు.
కేంద్రంలో మా సర్కారే..
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెలంగాణకు 4 మంత్రి పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సెక్రెటేరియట్ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అందరితో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తామని చెప్పారు. తెలంగాణ గీతం బాధ్యతలను అందెశ్రీ కి అప్పగించామని, ఇందులో తన ప్రమేయం లేదని తెలిపారు. దీనిపై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. కేసీఆర్ లెక్క కమీషన్ల కోసం తాను ఔట్ సోర్సింగ్ కో, ఇతర ఏజెన్సీలకో ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఒకే రకమైన బ్రాండ్ విత్తనాలు కావాలని ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు మాత్రమే అడుగుతున్నారని, దీంతో అక్కడ మాత్రమే కొరత ఉన్నదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి రైతులు బార్డర్ దాటి ఇక్కడకు రావడంతో విత్తనాల కొరత ఏర్పడిందని తెలిపారు. విత్తనాల స్టాక్ లేనప్పుడు లైన్లో చెప్పులు పెడితే లాభం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 న రుణ మాఫీ చేస్తామని తెలిపారు. పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన చరిత్ర సమ్మక్క, సారలమ్మ, జంపన్నలదని, వాళ్లను చంపింది కాకతీయులేనని తెలిపారు. తాను పీడిత ప్రజల కోసం పోరాడిన వారి వైపే ఉంటానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తం
రాష్ట్రంలో 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. రెండు ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకుంటామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ఆ పార్టీకి 4 నుంచి 5 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ట్విట్టర్ పోస్ట్ చేశారని తెలిపారు. వంద రోజుల తన పాలనను చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరానని, తన పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అనే మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. తమకు అనుకూలంగానే ఎంపీ ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పారు.
ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో తేడా ఉంటే రోజుకు ఇంకో రెండు గంటలు సీఎంగా ఎక్కువ కష్టపడుతానని తెలిపారు. పీసీసీ చీఫ్ గా ఈ నెల 27 తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాతనే ఆ పదవిపై హైకమాండ్ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడే పీసీసీ చీఫ్ అవుతారని తెలిపారు. నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని, ఎన్ని పదవులు ఇచ్చినా ఇంకా అడిగే వారు ఉంటారని, మరో రెండేండ్ల తర్వాత మరింత మందికి ఇస్తామని తెలిపారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడం అనేది నిరంతర ప్రక్రియ అని, గేట్లు తెరిచే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ‘టీజీ’గా ఉండడం అనేది ఇక్కడి ప్రజల గుండెల నుంచి వచ్చిందని చెప్పారు. ఉద్యమ సమయంలో కూడా ఎందరో తమ చేతులపై ‘టీజీ’ అని పచ్చబొట్టు వేయించుకున్నారని తెలిపారు.
కేసీఆర్‌ను కాపాడేందుకే సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
కేసీఆర్‌ను లొంగదీసుకునేందుకే తాను ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వాడుకుంటున్నానని బీజేపీ చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. మరి ఇప్పుడు కేసీఆర్‌ను లొంగదీసుకునేందుకే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్చేస్తున్నదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ ధర్నా చేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ సాగుతున్నదని, దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పుడే.. తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదంటూ ఆరోపించారని, మరి అప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరలేదని రేవంత్ ప్రశ్నించారు.
రైతు భరోసా, రైతు రుణమాఫీపై కేసీఆర్ వితండవాదం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గుట్టలకు, రోడ్లకు, ఫామ్ హౌజ్ లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడని ఆరోపించారు. అలా ఇవ్వకూడదనేది తమ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదోడికి అందాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం కోసం సెక్రెటేరియట్ నుంచే పని మొదలు పెడ్తానని చెప్పారు. సీఎం, సీఎస్ లకు బయోమెట్రిక్ పెడ్తే మిగితా వారిలో జవాబుదారీతనం వస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడ్తామని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేస్తామని తెలిపారు.
నా హయాంలో దశాబ్ది ఉత్సవాలు రావడం అదృష్టం
వెయ్యి కోట్ల రూపాయలతో తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని 2014 లో గండిపేట వేదికగా జరిగిన తెలుగుదేశం మహానాడులో తానే తీర్మానం చేయించానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తాను సీఎంగా ఉన్న సమయంలో రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో డాక్టర్ల సూచన మేరకు ఉత్సవాల్లో పాల్గొనే విషయం అనుమానంగా ఉన్నదని తెలిపారు.
ఒకవేళ ఆమె ఈ ఉత్సవాలకు రానిపక్షంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం పంపిస్తారని రేవంత్ చెప్పారు. ఇక నుంచి వారంలో మూడు రోజులు తాను ఫుట్ బాల్ ఆడనున్నట్టు చెప్పారు. ఇందుకోసం గ్రౌండ్ కూడా సిద్ధమవుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుట్ బాల్ గ్రౌండ్ లను అభివృద్ధి చేస్తామని, స్కూళ్లు, కాలేజీ విద్యార్థులతో వారంలో ఒకసారి తాను ఫుట్ బాల్ ఆడుతానని చెప్పారు.
ప్రతి ఒక్క అమరుడి కుటుంబానికి న్యాయం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏ ఒక్క అమరుడిని విస్మరించేది లేదని, గ్రామ సభల ద్వారా, పోలీస్టేషన్ల నుంచి వారి వివరాలు సేకరించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే అమరుల కుటుంబాలు ఎలాంటి గడువు లేకుండా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వీరందరికీ న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తామని తెలిపారు. ఓఆర్ఆర్ టోల్ ట్యాక్స్ పై విచారణ సాగుతున్నదని, నయీం ఆస్తుల కేసు తన వద్దకు రాలేదని చెప్పారు. మద్యం బ్రాండ్ల అనుమతి విషయం బేవరేజెస్ సంస్థ చూసుకుంటుందని తెలిపారు.
సివిల్ సప్లైలో వచ్చిన ఆరోపణలపై సంబంధిత మంత్రి వివరణ ఇచ్చారని తెలిపారు. బీసీ కుల గణనను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో టీ శాట్ ద్వారా డిజిటల్ విద్యను అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన అన్నింటిని సమకూరుస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ అధికారులు, దానిపై విచారణ చేస్తున్న కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. తమ ప్రభుత్వ సొంతంగా ఏ అధికారిపై ఆరోపణలు రాగానే చర్యలు తీసుకోవడం ఉండదని చెప్పారు. ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని గేట్లు ఓపెన్ చేశామని తెలిపారు.