మహబూబాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్ రెడ్డి
  • నష్టపోయిన తండాలను మారుస్తం
  • నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
  •  సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 

మహబూబాబాద్: మానుకోటలో మునుపెన్నడు లేనంతగా భారీ వర్షం కురిసిందని, వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 30 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని చెప్పారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణనష్టం తక్కువగా నమోదైందని అన్నారు. ఇవాళ మహబూబాబాద్ లో వరదలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని చెప్పారు.  

పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామని తెలిపారు. నష్టపోయిన మూడు తండాలవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.  నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలని అన్నారు.  కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానిని కోరినట్టు సీఎం చెప్పారు.  ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించామని వివరించారు.  తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి. వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చునని అన్నారు.  విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది.. మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

ఎవరినీ వదలం.. ఆక్రమణలు కూల్చుతం

చెరువులు, కుంటలు ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్న వారెవరైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం పునరుద్ఘాటించారు. ఎంత ఒత్తిడి ఉన్నా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నామని వివరించారు. ఆక్రమణలకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని అన్నారు.