
- ఇంటర్నేషనల్ వైద్య సదుపాయాలన్ని అక్కడే లభించేలా ప్రణాళిక: సీఎం రేవంత్
- డిజిటల్ హెల్త్ కార్డ్‌తో ప్రతి పౌరుడి హెల్త్ కండిషన్ రికార్డ్ చేస్తమని వెల్లడి
- ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి అభినందన సభ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ కండిషన్ రికార్డ్ చేయడానికి డిజిటల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తామని సీఎం రేవం త్ రెడ్డి అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి విషయాన్ని రికార్డ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అందించడం సులువు అవుతుందని తెలిపారు. ఈ డిజిటల్ హెల్త్ కార్డును రూపొందించడంలో ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతీసుకుంటుందని వెల్లడించారు. నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని యెచిస్తున్నట్టు తెలిపారు. ఆ క్యాంపస్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వివరించారు. ఇదివరకు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లేవాళ్లమని, ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి మన రాష్ట్రానికి, హైదరాబాద్‌కు చాలా మంది వస్తున్నారని తెలిపారు. ఎటువంటి ట్రీట్మెంట్అయినా సరే రాష్ట్రంలోనే లభించే స్థాయికి ఎది గేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తీసుకురాబోయే హెల్త్ పాలసీలో నాగేశ్వర్ రెడ్డి అనుభవా న్ని, సహకారాన్ని తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామో దర రాజనర్సింహను కోరారు.
తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన నాగేశ్వర్ రెడ్డి
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టారని, ఆయనను సన్మానించుకోవడం మంచి సంప్రదాయమని సీఎం రేవంత్ అన్నారు. 40 ఏండ్లుగా వైద్య సేవలో ఉన్న ఆయన ఏనాడు దాన్ని వృత్తిగా భావించ లేదని, బాధ్యతగా నిర్వర్తించారని అన్నారు. తెలుగు వ్యక్తికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందే అరుదైన అవకాశం వచ్చిందన్నారు. నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతావక్తలు ఆశాభావం వ్యక్తం చేశారని, ప్రభుత్వం తరఫున ఆయనకు భారతరత్న ఇప్పించే బాధ్యత ఉత్తమ్ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు రాజనర్సింహ, ఉత్తమ్, శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వసలహాదారు అలీ షబ్బీర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, డాక్టర్ పీఎస్ రెడ్డి, డాక్టర్ విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగువాడినైనందుకు గర్వపడుతున్న: నాగేశ్వర్ రెడ్డి
‘‘నేను రెండు విషయాల్లో గర్వపడుతున్నాను. పద్మవిభూషణ్ పొందిన మొదటి తెలుగు వ్యక్తిని అయినందుకు. రెండోది గ్యాస్ట్రో ఎంటరాలజీలో తీసుకున్నందు కు. గ్యాస్ట్రో ఎంటరాలజీ గురించి చాలా మందికి తెలి యదు. నాకు అవార్డు రాగానే అందరూ దాని గురించి వెతుకున్నారు” అని నాగేశ్వర్ రెడ్డి అన్నారు.