- ప్రజల కోసం పనిచేసేవాళ్లకు అన్నివిధాలా సహకారం: సీఎం రేవంత్‌రెడ్డి
- అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు ఇస్తం
- ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్‌లైన్స్ రూపొందించాలి
- కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పని చేస్తున్నరు
- భాష విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నరు
- ఆ ట్యూబ్, ఈ ట్యూబ్ అంటూ ఇష్టమున్నట్లు చేస్తున్నరని వ్యాఖ్య
- జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమి అప్పగింత
- మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల కోసం పనిచేసే నిజమైన జర్నలిస్టులను తమ సర్కారు కాపాడుకుంటుందని, అలాంటి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజమైన జర్నలిస్టుల గౌరవానికి భంగం కలిగించబోమని, అలాంటి వాళ్లకు అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి పట్టాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని.. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ (జేఎన్జే) హౌసింగ్ సొసైటీకి పేట్బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాల భూమిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు కేటాయించిన భూములతో 1,100 మంది జర్నలిస్టులు ఇంటివారవుతారని చెప్పారు. మిగిలిన జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో వారికి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘‘ఇండ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శషభిషలు లేవు. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తం.అర్హులను ఎంపిక చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించినం. వారు కసరత్తు పూర్తిచేసి వస్తే నిమిషంలో సంతకం చేస్త” అని ఆయన హామీ ఇచ్చారు.
కులీకుత్బుషా హైదరాబాద్ నగరాన్ని, నిజాం నవాబులు– బ్రిటిష్‌వారు కలిసి సికింద్రాబాద్‌ను, చంద్రబాబు – వైఎస్ రాజశేఖరరెడ్డి కలిసి సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే తాము ఫోర్త్‌సిటీ (ఫ్యూచర్ సిటీ)ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ అభివృద్ధిలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గత పదేండ్ల కాలంలో తెలంగాణకు ఎలాంటి పాలసీలు లేకుండా పాలనా వ్యవస్థను భ్రష్టుపట్టించారని బీఆర్ఎస్ను విమర్శించారు. ‘‘రాత్రికి రాత్రి ఏ వ్యవస్థల్నీ మార్చలేం. పది సంవత్సరాలు ఒక విధానం అంటూ లేకుండా పోయింది. కానీ ప్రజా పాలనలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో సరికొత్త మార్పులు తీసుకు వస్తున్నాం. ప్రస్తుతం టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్, విద్య, వైద్యం తదితర రంగాలకు ప్రత్యేక పాలసీలు రూపొందించాం” అని ఆయన తెలిపారు.
Also Read:-తెలంగాణలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు
ఎవరు అసలో, ఎవరు కొసరో తెలుస్తలేదు..
కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టులు కార్యకర్తల్లా మారిపోయి యాజమానులకు మొత్తం వ్యవస్థల్ని అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలో ముఖ్యమంత్రి హోదాను కూడా అవమానపరుస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. కొందరు ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందని, ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. “ఇప్పుడు అసలు జర్నలిస్టు ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదు. ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది. ఎవరు పడితే వారు జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఎక్కడికి పడ్తే అక్కడికి వెళ్లి ఏది పడ్తే అది మాట్లాడుతున్నరు. అక్కడున్న జనం ఏమన్నా అంటే.. జర్నలిస్టుల మీద దాడులు అని వీళ్లే చెప్పుకుంటున్నరు. ఇలాంటి వాళ్లే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రెస్మీట్లకు వచ్చి ముందువరుసలో కూర్చుంటున్నరు. వాళ్లకు ఏమి అడగల్నో తెలియదు. మాకు ఏమి చెప్పల్నో అర్థం కాదు. గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్టులకు కూడా కుర్చీ దొరుకుతలేదు. ఈ పరిస్థితి మారాలి’’ అని సీఎం పేర్కొన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు అసభ్యంగా , అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే సహజమైన ప్రతిచర్య ఉంటుందని, దాన్ని మొత్తం జర్నలిస్టులకు ఆపాదించుకోవద్దని సూచించారు.
సీఎం హోదాను దిగజారుస్తరా?
‘‘కొన్ని రాజకీయ పార్టీలు ప్రారంభించిన పత్రికల్లో కొందరు జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా మారి ప్రభుత్వ కార్యక్రమాల్లోకి, ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నరు. కొంతమందితో సెక్రటేరియెట్‌లోకి, మంత్రుల కార్యాలయాల్లోకి వచ్చి జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు చూపుతూ అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నరు. మీడియాలో ఏ భాష వాడాలి.. ఎలాంటి పదప్రయోగం చేయాలి.. అనే ఎథికల్ లైన్ ఉండాలి కదా. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి రాసేటప్పుడు అవమానకర భాష వాడుతున్నరు. రేవంత్‌రెడ్డి మీకు వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు. కానీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్. ప్రజలిచ్చిన ముఖ్యమంత్రి అనే గౌరవ ప్రదమైన హోదాను కాపాడాల్సిన బాధ్యత మీడియా యజమానుల ముసుగులో ఉన్న రాజకీయనాయకులకు ఉండదా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాలైన జర్నలిస్టులున్నరు. ప్రజల కోసం, ప్రజల మధ్య లో ఉండి, ప్రజాసమస్యలను వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే.. కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి, ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పగించడానికి ప్రయత్నిస్తున్న వారు మరోవర్గం. ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు నష్టం కలుగుతుంది. అలా జరగకుండా మీడియా అకాడమీ చర్యలు తీసుకోవాలి.. జర్నలిస్టు అనే పదానికి సరైన డెఫినెషన్ఇవ్వాలి. మేము ఎవ్వరిని జర్నలిస్టుగా చూడాలో క్లారిటీ ఇవ్వాలి. అడ్డందొడ్డం మాట్లాడడం, ఏమైనా అంటే జర్నలిస్టుల మీద దాడి అంటూ రాద్ధాంతం చేయడం.. ఈ విధానానికి ఇక పుల్‌స్టాప్ పెట్టాలి. అసెంబ్లీ, సెక్రటేరియెట్, ప్రభుత్వ కార్యాలయాల్లోకి మిమ్మల్ని అనుమతించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, దానికి సరైన విధానం తీసుకొని రావాలి. పత్రికల సర్క్యులేషన్‌ను బట్టి ఎందరికి, ఎక్కడికి పాస్లివ్వాలి.. అనే నిబంధనలు రూపొందించాలి’’ అని ప్రెస్ అకాడమీకి ఆయన సూచించారు.
మీడియా అకాడమీకి రూ. 10 కోట్లు
జర్నలిస్టుల అక్రెడిటేషన్, ఆరోగ్య భద్రత కార్డులు, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిరుపేద జర్నలిస్టులకు ఆర్థికసాయం చేసేందుకు, మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు, జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మీడియా అకాడమీకి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
జర్నలిస్టులు వృత్తి గౌరవాన్ని కాపాడాలి
వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని, అది మనకు మనమే పెంచుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. జర్నలిజం రంగంలో ఎంతో మంది అనుభవజ్ఞలైన వారు ఉన్నారని, కానీ నేడు కొందరు జర్నలిస్టుల పేరుతో చేసే పనుల వల్ల వృత్తికే చెడ్డపేరు వస్తున్నదని తెలిపారు. ‘‘మీడియా రంగంలో పెరుగుతున్న పెడధోరణి వల్ల నిజమైన జర్నలిస్టులకు గౌరవం లేకుండా పోతున్నది. ఈ పరిస్థితి మారాలి. ఆ మేరకు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది” అని సూచించారు. అన్ని వృత్తుల్లోనూ ఇలాంటి సమస్య ఉందన్నారు. ‘‘జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్ల వంటి వారు. సమాజంలోని పెద్ద రుగ్మతులను, సమస్యలను పరిష్కరించే జర్నలిస్టులు అనారోగ్యానికి, నిర్లక్ష్యానికి గురికాకూడదన్న లక్ష్యంతో వారి సంక్షేమం కోసం ఇండ్ల స్థలాలు కేటాయించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నరు.
అయితే జర్నలిస్టుల దురదృష్టానికి కేసుల పేరుతో కొన్నేండ్లు, గత పాలకుల నిర్లక్ష్యంతో మరికొన్నేండ్లు ఎన్నో బాధలు పడ్డరు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 1,100 మంది జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం చూపించినం” అని వివరించారు. జర్నలస్టుల ఇండ్ల స్థలాలు, వారి సమస్యల పరిష్కార బాధ్యతలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, దానిని కనుగొనేందుకు బాధ్యత, అంకితభావం ఉండాలని, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ‘‘ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జటిలమైన సమస్యగా ఉండె. ఈ సమస్యను కాంగ్రెస్‌పార్టీ పరిష్కరించింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న జేఎన్జే హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారాన్ని కూడా మా బాధ్యతగా భావించి శాశ్వత పరిష్కారం చూపించినం. అందుకు తగ్గట్టు ఫైల్ ప్రొసీడింగ్‌లో భాగంగా నా వద్దకు రాగానే వెంటనే సంతకం చేసిన. ఫైలు కదలికలో కొంత జాప్యం జరిగింది. కానీ సమస్య పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామనేది వాస్తవం” అని సీఎం చెప్పారు.
జర్నలిస్టుల 18 ఏండ్ల కల నెరవేరింది: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నదని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జేఎన్జే హౌసింగ్ సొసైటీకీ పేట్బషీరాబాద్లో 38 ఎకరలా భూమిని అందజేశామని తెలిపారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం 18 ఏండ్ల జర్నలిస్టుల కలనెరవేర్చాం. దీంతో 1,100 మంది జర్నలిస్టులు కోటీశ్వరులు అవుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలవాలంటేనే నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోనే ఉంటున్నారు” అని చెప్పారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులతో నాటి సీఎం ఏ విధంగా వ్యవహరించేవారో అందరికీ తెలుసునని, మీడియా సమావేశాల్లోనూ జర్నలిస్టు మిత్రులను కసురుకునే వారని, ఆయన భాష అలాగే ఉండేదని కేసీఆర్‌ను విమర్శించారు.
తమది జర్నలిస్టు ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. కానీ కొందరు గులాబీ మిత్రులు హైడ్రాను కూడా ఎలా చిత్రిస్తున్నారో మనం చూస్తున్నామని, వరదలను కూడా వారు రాజకీయం చేస్తున్నారన్నారు. వారి పత్రికల్లో ఇష్టారాజ్యంగా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ‘‘ప్రజలు రెండు సార్లు ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టినా వారికి బుద్ధి రావడం లేదు. ఖమ్మంలో వరదల సందర్భంగా కూడా బురదరాజకీయం చేపట్టారు” అని బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి అర్హులైన జర్నలిస్టులను ఎంపిక చేస్తామని, అందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి ప్రకటించారు.
అందరూ బాగుండాలి: పొన్నం
జర్నలిస్టులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న కల నెరవేరడానికి 18 ఏండ్లు పట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్నలిస్టులు వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ అని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్‌యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జేఎన్జే హౌసింగ్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు. .