గ్లోబల్ హబ్ గా AI సిటీ..ముచ్చర్లలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తం: రేవంత్

  • ముచ్చర్లలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తం
  • ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచానికి ఉపయోగపడాలి
  • 25 అంశాలతో రోడ్ మ్యాప్ విడుదల చేసిన సీఎం
  • హెచ్ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమిట్ ప్రారంభం
  • రెండు వేల మందికి పైగా నిపుణులు హాజరు

హైదరాబాద్: ముచ్చర్ల ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, దానిని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైటెక్స్ లో ఏఐ గ్లోబల్ సమిట్ ను సీఎం ప్రారంభించారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఏఐ నిపుణులు  హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. రైల్ ఇంజిన్, ఫొటో కెమెరా మొదలు కొని ఏఐ దాకా వచ్చామని అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందని చెప్పారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఇస్తున్నామని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు.  మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. అత్యాధునిక వసతులతో ఏఐ సిటీని నిర్మించబోతున్నామని వివరించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఏఐని వినియోగిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథ అనే థీమ్ తో ముందుకు వెళ్తామని అన్నారు. ఏఐ టెక్నాలజీని మిస్ యూజ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.