- హైదరాబాద్లో అండర్గ్రౌండ్కరెంట్ వైర్లు, కేబుల్స్
- వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీలను స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి
- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబా ద్లో అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–-2025ను శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
అనంతరం విద్యుత్ శాఖ పై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని, వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరి స్తున్నందున.. రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సరఫరా జరగాలన్నారు.
ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యమ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
నిరుడు మార్చిలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని, ఈ సారి 16, 877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళిక చేసుకోవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్టు సరఫరా ఉండాలన్నారు.
ఆదివాసీ ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్
ఆదివాసీ గూడేలలో ఇండ్లకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని.. పూర్తి నివేదిక ఆధారంగా ఆదివాసీ గూడేలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి, ఏ విధానంలో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలన్నారు.
ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని సూచించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిగి వద్ద 400 కేవీ సబ్ స్టేషన్ మంజూరయినా పదేండ్లుగా పెండింగ్‌లోనే ఉందని.. దానికి సంబంధించిన పురోగతి నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గోషామహల్లో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించనున్నందున అక్కడ స్టేడియం పక్కనే ఉన్న సబ్ స్టేషన్ ను మరోవైపు తరలించాలన్నారు. మరింత అదనపు సామర్థ్యంతో పూర్తిగా అధునాతన టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జెన్ కో సీఎండీ సందీప్ సుల్తానియా , ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్,. డిస్కం సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, టీజీ రెడ్కో ఎండీ అనీల పాల్గొన్నారు.