బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2014 నుంచి 2023 వరకు లోక్ సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందల బిల్లులకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. ఒక ఎంపీ అయితే స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లి మరీ బిల్లుకు అనుకూలంగా ఓటేశారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని కామెంట్ చేశారు. దీనిపై సీఎం శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.
“కేటీఆర్ ను సీఎం చేయాలని క్యాబినెట్ మంత్రులే కేసీఆర్ ను ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి కేటీఆర్ ను సీఎం చేస్త. మీ అనుమతి, ఆశ్వీరాదం కావాలని అడిగారు. ఈ విషయం హైదరాబాద్ కు వచ్చినపుడు మోదీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. వారసత్వ, రాచరిక రాజకీయాలను ఒప్పుకోను, అంగీకరించనని అన్నారు” అని సీఎం గుర్తు చేశారు. ‘‘సీఎం మార్పుపై కూడా మోదీని అడిగారంటే మీది ఫెవికాల్ బంధం. కేసీఆర్ మీకు కొన్ని చెప్పి, మరికొన్ని దాస్తడు” అని పోచారంను ఉద్దేశించి సీఎం అన్నారు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారని, దీంతో ఆ ముగ్గురిని కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తిరిగి 2014లో చేర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, “కాంగ్రెస్ అభ్యర్థికి ఓటెయ్యాలని మీ అల్లుడు చెబితే ఓటేశామని.. మీ అల్లుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ప్రశ్నించారు” అని రేవంత్ తెలిపారు.
ఈ సర్కార్ ఐదేండ్లు ఉండాలె: పోచారం
సీఎం కామెంట్లపై పోచారం స్పందిస్తూ.. బీజేపీతో తమకు ఫెవికాల్ బంధం ఉంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు ఓడిస్తామని ప్రశ్నించారు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ కూడా పోటీ చేశారన్నారు. సీఎం అభ్యర్థిని మార్చాలంటే తమకు మోదీ పర్మిషన్ ఏమీ అవసరం లేదన్నారు. తమకు బీజేపీతో సంబంధం లేదని, ఎంఐఎం మాత్రమే ఫ్రెండ్లీ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మూడేండ్లు కాదని, ఐదేండ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
ప్రతిపక్షనేత కుర్చీ ఖాళీగా ఉండొద్దు..
తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదని, మనందరి భావోద్వేగమని సీఎం రేవంత్చెప్పారు. విధ్వంసకర ధోరణిని తిరస్కరిస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రెండు రోజులుగా హాజరుకావడం లేదని, 80 వేల పుస్తకాలు చదివిన మేధావి మేధస్సును 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నా మని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదని అన్నారు. భవిష్యత్ లోనైనా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
గ్రూప్1 ఏజ్ రిలాక్సేషన్
ఉద్యోగ నియామకాలంటే గతంలో సంతల్లో సరుకుల్లా, జిరాక్స్ సెంటర్లలో క్వశ్చన్ పేపర్లు దొరికాయని, తాము బీఆర్ఎస్ సర్కారులా కాకుండా, ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత సర్కారు నిర్లక్ష్యంతో ఆగిపోయిన పలు రిక్రూట్మెంట్ ప్రక్రియలను ముందుకు తీసుకుపోతున్నట్టు చెప్పారు. వైద్యారోగ్యశాఖలో 6,954 స్టాఫ్ నర్స్ లకు, సింగరేణిలో 4 వందల మందికి పైగా నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలనూ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు తీసుకొచ్చామని, త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులు నష్టపోకుండా గ్రూప్1 వయోపరిమితి 46 ఏండ్ల వరకు పెంచామని సీఎం వెల్లడించారు.
ఢిల్లీ, ముంబైలను తలదన్నేలా హైదరాబాద్
హైదరాబాద్ సిటీని ఢిల్లీ, ముంబై సహా ఇతర సిటీలను తలదన్నేలా రూపు రేఖలను మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓల్డ్సిటీతో పాటు హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరిస్తామని అన్నారు. రంజాన్ పండుగ కోసం ఏర్పాట్లు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించి శుక్రవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. ఓఆర్ఆర్ లోపల అర్బన్, బయట 50 కిలోమీటర్ల వరకు సెమీ అర్బన్ సిటీని విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్హయాంలో 75 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఎల్అండ్టీకి టెండర్లు పిలిచామని, బీఆర్ఎస్ హయాంలో ఆ సంస్థ 69.5 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రోను నిర్మించిందన్నారు. ఇప్పటికే మెట్రోలైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉండటంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.