బ్రిటిషర్ల కంటే బీజేపోళ్లు డేంజర్ వాళ్లను తరిమినట్టే.. వీళ్లనూ తరమాలి: సీఎం రేవంత్

బ్రిటిషర్ల కంటే బీజేపోళ్లు డేంజర్ వాళ్లను తరిమినట్టే.. వీళ్లనూ తరమాలి: సీఎం రేవంత్
  • రాహుల్‌ది గాంధీ ఆలోచన.. మోదీది గాడ్సే ఆలోచన
  • బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం 
  • కులగణనపై ప్రశ్నిస్తారనే రాహుల్‌కు పార్లమెంట్‌లో మైక్‌ ఇవ్వలేదని ఫైర్ 
  • ఏఐసీసీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం 

హైదరాబాద్, వెలుగు: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ నేతృత్వంలో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘బ్రిటిష్ పాల‌న‌కు వ్యతిరేకంగా గాంధీ దండి స‌త్యాగ్రహంతో పాటు 30 ఏండ్లు అనేక పోరాటాలు చేశారు. అయినా బ్రిటిష్‌ వాళ్లు ఎప్పుడూ గాంధీ మీద లాఠీ ప్రయోగించలేదు. ‘‘కానీ, స్వాతంత్య్రం వ‌‌‌‌చ్చిన 6 నెలల్లోనే గాడ్సే గాంధీజీపై తుటా పేల్చి ఆయ‌‌‌‌న‌‌‌‌ను హ‌‌‌‌త్య చేశారు. బ్రిటిష‌‌‌‌ర్ల కంటే బీజేపీ నాయ‌‌‌‌కులు ప్రమాద‌‌‌‌కారులు. బ్రిటిషోళ్లను దేశం నుంచి త‌‌‌‌రిమికొట్టిన‌‌‌‌ట్టే.. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలి” అని రేవంత్​ అన్నారు. ఇందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పారు. గుజరాత్‌‌‌‌లోని అహ్మదాబాద్‌‌‌‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ‌‌‌‌లో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమన్నారు. ఆ పార్టీని ఓడించాలనే ఆదేశాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నామని.. రానున్న రోజుల్లో బీజేపీని ఓడిస్తామనే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్య క‌‌‌‌ర్త, గాంధీ వార‌‌‌‌సులు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లాల‌‌‌‌ని పిలుపునిచ్చారు. ‘‘మేం నిజాం పాలనలో ఉన్నప్పుడు జ‌‌‌‌వ‌‌‌‌హ‌‌‌‌ర్‌‌‌‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో మాకు స్వాతంత్య్రం వ‌‌‌‌చ్చింది. అందుకే గుజరాత్ ప్రజ‌‌‌‌ల‌‌‌‌తో, వ‌‌‌‌ల్లభాయ్ ప‌‌‌‌టేల్ వార‌‌‌‌సుల‌‌‌‌తో మా తెలంగాణ  ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు మంచి అనుబంధం ఉంది. మా తెలంగాణకు వ‌‌‌‌ల్లభాయ్ ప‌‌‌‌టేల్ స్వాతంత్య్రం ఇస్తే, సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అలాంటి వ‌‌‌‌ల్లభాయ్ ప‌‌‌‌టేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా... సోనియా గాంధీ నాయకత్వంలో బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం.. ఆ పార్టీని అడ్డుకుంటాం.. వాళ్లను ఎవ‌‌‌‌రూ క్షమించ‌‌‌‌రు” అని అన్నారు. 

గాడ్సే వారసులను ఓడిద్దాం.. 

రాహుల్‌‌‌‌ది గాంధీ ఆలోచన, మోదీది గాడ్సే ఆలోచన అని సీఎం రేవంత్ అన్నారు. ‘‘గాంధీ ఆలోచ‌‌‌‌న‌‌‌‌ల‌‌‌‌కు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ నాయకత్వంలో మ‌‌‌‌నం ప్రయత్నిస్తున్నాం. కానీ, మోదీ మాత్రం గాడ్సే ఆలోచ‌‌‌‌న విధానాన్ని దేశంలో వ్యాపింప‌‌‌‌జేసేందుకు ప్రయ‌‌‌‌త్నిస్తున్నారు. గాడ్సే వార‌‌‌‌సుల ఆలోచ‌‌‌‌న ధోర‌‌‌‌ణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబస‌‌‌‌భ్యులు, రాహుల్ గాంధీకి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలి.. మోదీకి వ్యతిరేకంగా పోరాడాలి. దేశంలోని గాంధేయ‌‌‌‌వాదులంతా మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్‌‌‌‌గాంధీకి అండ‌‌‌‌గా నిల‌‌‌‌వాలి. గాంధీ ఆలోచ‌‌‌‌న‌‌‌‌లతో ఉన్న మన‌‌‌‌మంతా గాడ్సే వార‌‌‌‌సులను, మోదీని ఓడించాలి” అని పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తామంతా ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే, దేశాన్ని విభజించే గ్యారంటీ అని విమర్శించారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. అది చెప్పి 11 ఏండ్లు దాటిపోయింది. ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలను ఈ దేశంలోని నిరుద్యోగులకు మోదీ ఇవ్వాల్సి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలేమో గానీ మోదీ, అమిత్ షాకు మాత్రం ఉద్యోగాలు వ‌‌‌‌చ్చాయి” అని ఎద్దేవా చేశారు. మణిపూర్‌‌‌‌లో మోదీ మంట‌‌‌‌లు రాజేశారని, దేశ మూలవాసుల జీవ‌‌‌‌న హ‌‌‌‌క్కును కాల‌‌‌‌రాసే ప్రయ‌‌‌‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

రాహుల్ ఇచ్చిన హామీలు నెరవేర్చాం.. 

ఎన్నికల టైమ్‌‌‌‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన పాద‌‌‌‌యాత్రలో భాగంగా తెలంగాణ‌‌‌‌కు వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగ‌‌‌‌ణ‌‌‌‌న‌‌‌‌, రైతు రుణ‌‌‌‌మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, మ‌‌‌‌హిళ‌‌‌‌ల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెల‌‌‌‌ల్లోనే వాటిని అమలు చేసి చూపించాం. 25 ల‌‌‌‌క్షల రైతు కుటుంబాల‌‌‌‌కు రూ.21 వేల కోట్లు రుణ‌‌‌‌మాఫీ చేశాం.. కులగ‌‌‌‌ణ‌‌‌‌న కూడా చేసి చూపించాం” అని చెప్పారు. కులగణనపై రాహుల్ లోక్‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌లో మాట్లాడతార‌‌‌‌న్న భ‌‌‌‌యంతోనే ఆయ‌‌‌‌న‌‌‌‌కు ప్రధాని మోదీ మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశామని, వాటికి పార్లమెంట్‌‌‌‌లోనూ ఆమోదం తెలపాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్ వద్ద ధర్నా చేశామన్నారు.