- ఇది తెలంగాణ రైతుల ఘనత: సీఎం రేవంత్
- బీఆర్ఎస్ ఇన్నేండ్ల తప్పుడు ప్రచారం పటాపంచలైందని ట్వీట్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని ఇన్నేండ్లుగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం పటాపంచలైందని అన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా.. ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం..తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.