- కొందరు కావాలనే రాడార్ సెంటర్‌పై అపోహలు సృష్టిస్తున్నరు: సీఎం రేవంత్
- దీనికి గత ప్రభుత్వ హయాంలోనే భూబదలాయింపు, నిధుల కేటాయింపు
- మా సర్కార్‌పై విమర్శలు సరికాదు
- దేశ భద్రత అంశాన్ని వివాదాస్పదం చేయొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాడార్ సెంటర్ విషయంలో కొందరు ప్రజల్లో అపోహలు సృష్టి స్తున్నారని మండిపడ్డారు. మంగళవారం దామగుండం రాడార్ సెంటర్‌కు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రాడార్ కేంద్రానికి 2017లో అప్పటి ప్రభుత్వమే భూమి కేటాయించింది. నిధుల కేటాయింపు సహా ఇతర నిర్ణయాలన్నీ అప్పట్లోనే జరిగాయి. సెంటర్‌ను ప్రారంభించాలని కేంద్రం కోరడంతో మేం కొనసాగించాం. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు’’ అని బీఆర్ ఎస్‌కు చురకలు అంటించారు. పర్యావరణంపై ఆందోళనలను తాము అర్థం చేసు కుంటామని, అయితే దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలనే విషయాన్ని కూడా పర్యావరణ ప్రేమికులు ఆలోచించాలని సూచించారు. దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద రాడార్ సెంటర్‌ను వికారాబాద్‌లోని పూడూరులో కేంద్రం ఏర్పాటు చేస్తున్నదని.. ఇప్పటికే దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్ఎఫ్ సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
భక్తులను ఆలయానికి వెళ్లనివ్వండి..
ఈ ప్రాంతంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులను అనుమతించాలని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల సెంటిమెంట్ ను గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యాసంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని విన్నవించారు. ‘‘తమిళనాడులోనూ 1990లో ఇలాంటి రాడార్ కేంద్రాన్నే ప్రారంభించారు. 34 ఏండ్ల నుంచి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రాడార్ సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంతం, జిల్లా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు.
తప్పుడు ప్రచారం మానుకోండి: రామ్మోహన్ రెడ్డి
రాడార్ సెంటర్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ‘‘ఇక్కడ 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదే 2 లక్షల చెట్లు. గత పదేండ్లలో 12 లక్షల చెట్లు కొట్టేశారని హైకోర్టుకు అటవీ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. తమిళనాడులో 34 ఏండ్ల కింద రాడార్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. సెల్ సిగ్నల్ కంటే తక్కువ రేడియేషన్ ఉంది. తప్పుడు ప్రచారం చేసే వాళ్లను అక్కడికి వెళ్లి చూపిస్తాం. ఇక్కడ హాస్పిటల్, స్కూల్ ఏర్పాటు చేస్తారు. లోకల్ పబ్లిక్ కు 15 శాతం ఉద్యోగాలు ఇస్తారు” అని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ను మరింత పెంచడంలో ఈ రాడార్ సెంటర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠి అన్నారు.
దేశ రక్షణ కోసంకలిసికట్టుగా నడుద్దాం..
రాడార్ సెంటర్‌పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “రాడార్ సెంటర్ అంశాన్ని కొందరు వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుందని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. తద్వారా వికారాబాద్ జిల్లాకు నష్టం చేయాలని చూస్తున్నారు. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేయడం సరికాదు. అలాంటివాళ్లకు కనువిప్పు కలగాలి. రాడార్సెంటర్కు భూబదలాయింపు, నిధుల కేటాయింపు, ఇతర నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.
ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రం కోరడంతో మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించాను. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలమని పర్యావరణ ప్రేమికులకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. దేశంలో రెండో వీఎల్ఎఫ్ కేంద్రం మన ప్రాంతంలో ఏర్పాటవుతుండడం మనందరికీ గర్వకారణం. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు. దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది’’ అని చెప్పారు. గత 15 ఏండ్లుగా రాడార్ స్టేషన్ కోసం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.