- సరిహద్దుల్లో నిఘా పెంచండి
- రాజకీయ నాయకుల భద్రత కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యమివ్వండి
- పోలీసుల పిల్లల కోసం పోలీస్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ పేరెంట్స్ ఎవరైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ పిల్లలే డ్రగ్స్ బారినపడితే ఎంత బాధ ఉంటుంది? రాష్ట్రానికి ఆంధ్ర–-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తున్నదని సమాచారం ఉంది. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోకి గంజాయి, డ్రగ్స్ రాకుండా అడ్డుకోవాలి” అని సూచించారు.
మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.
తెలంగాణలో గత పదేండ్లలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారారు. ఇటీవల రెండు కుటుంబాలను పరామర్శిస్తే, గంజాయి వల్లే తమ కుటుంబాలు నాశనమయ్యాయని వాళ్లు ఆవేదన చెందారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని, తాము వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ బ్రాండే హైదరాబాద్. హైదరాబాద్ పోలీసు అంటే తెలంగాణకు గుండెకాయ. నగరంలో నేరాలను నియంత్రించకపోతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది” అని అన్నారు.
కుటుంబాలనూ పట్టించుకోవాలి
రాజకీయ నాయకుల భదత్ర కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు సీఎం రేవంత్ సూచించారు. ‘‘మేం ప్రజాప్రతినిధులం. మాకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరికి ఎంత అవసరమో అంతే ఇవ్వండి. భద్రత విషయంలో నాతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ, ఇతర విషయాల్లో కొన్నిసార్లు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఆ ఉత్సాహం నేరాల నియంత్రణపై చూపాలి” అని అన్నారు. ‘‘పోలీసుల పిల్లలు జీవితంలో రాణించలేరనే అపవాదు సమాజంలో ఉంది.
ఇందుకు ప్రధాన కారణం విధుల్లో పడి కుటుంబాలకు, పిల్లలకు సరైన సమయం కేటాయించకపోవడమే. అందుకే సైనిక స్కూళ్ల మాదిరే పోలీసుల పిల్లల కోసం పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల్లో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. ఆరు నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. అందులో హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చు” అని చెప్పారు.
తాము పోలీస్ కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకునేందుకు పోలీసుల పిల్లలు ఇబ్బందిపడతారు. అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న అభిప్రాయమే. ఆ అభిప్రాయం మారాలి. మా అన్న భూపాల్ రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్ గా పని చేసి, నన్ను చదివించారు. అన్న పెంపకంతోనే నేను ఈ రోజు సీఎం స్థాయికి వచ్చాను” అని తెలిపారు.