గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.5 కిలోమీటర్లు, 11.5 కిలోమీటర్ల చొప్పున ఫస్ట్ ఫేజ్ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నెలన్నరలో డిజైన్లు పూర్తవుతాయని చెప్పారు. ‘‘బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేషన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తాం.
బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగినం. దానికి బదులుగా ఇంకో దగ్గర వాళ్లకు ల్యాండ్ ఇస్తాం. మురుగునీటి శుద్ధి కోసం15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. ఫస్ట్ ఫేజ్ లో జరగనున్న పనుల్లో భాగంగా స్టాన్ ఫర్డ్ లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలు, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరూ వారాంతంలో ప్రశాంతంగా సేదతీరేలా మూసీ పునరుజ్జీవం ఉంటుంది” అని వివరించారు.
మూసీకి భూములిచ్చే వారికి సంతృప్తికరమైన ప్యాకేజీ ఇస్తామని, ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘సూటుబూటు వేసుకుని విదేశాల్లో తిరిగిన కేటీఆర్ కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. వాళ్లు వస్తే కచ్చితంగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం” అని తెలిపారు.
ALSO READ : ఫీల్డ్‌లోకి హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు
తనను కలవడం ఇష్టం లేకపోతే.. మంత్రులు, సీఎస్‌ను కలిసి అభ్యంతరాలు చెప్పాలన్నారు. మూసీ విషయంలో ఈటలకు ఒక స్టాండ్ లేదని.. కేటీఆర్, హరీశ్ మాట్లాడిందే మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని, దీనికి సంబంధించిన ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.