డీలిమిటేషన్​పై పోరాటమే..జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు

డీలిమిటేషన్​పై పోరాటమే..జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు
  • జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు: సీఎం రేవంత్
  • కేంద్రం తీరుతో పార్లమెంట్​లో దక్షిణాది ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతది
  • ఇన్నాళ్లూ ఆర్థికంగా నష్టపోయినం.. ఇప్పుడు రాజకీయంగానూ నష్టం కలిగిస్తే ఊరుకోం
  • ఇందిరాగాంధీ దూరదృష్టితో ఆలోచించి 25 ఏండ్లు 543 లోక్​సభ సీట్లనే కొనసాగించారు
  • ఆ తర్వాత 2002లో వాజ్​పేయి కూడా ఆమె బాటలోనే నడిచారు
  • మోదీ మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపట్టాలని చూస్తున్నరని ఫైర్​
  • డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని.. కేంద్ర ప్రభుత్వం  ప్రణాళిక ప్రకారం దాడి చేయాలని చూస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది దక్షిణాదికి ప్రమాదకరమైన సందర్భం. ప్రమాద ఘంటికలు మోగుతున్నయ్​. కేంద్ర ప్రభుత్వ విధానాలకు తగ్గట్టు జనాభాను నియంత్రించి దేశాభివృద్ధిలో భాగమైన దక్షిణాదికి పెను నష్టమే జరుగుతున్నది. ఇన్నాళ్లూ ఆర్థికంగా నష్టపోయాం.. ఇప్పుడు రాజకీయంగా నష్టం కలిగించాలనే చూస్తే ఊరుకోబోం” అని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదిన డీలిమిటేషన్​ను చేపడితే దక్షిణాది ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రమాదం ఉంటుందని.. దీనిపై కేంద్రంతో చర్చించేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని ఆయన కోరారు. 

కేంద్రం దిగివస్తే సరి.. లేదంటే అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేద్దామన్నారు. అందుకోసం దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, పార్టీలు, ప్రజాసంఘాలతో హైదరాబాద్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్​ నేతలు జానారెడ్డి, కేశవరావు నేతృత్వంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఆ సమావేశానికి హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్​ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిపై ఆయన మాట్లాడారు. ‘‘1971లో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలు అమలు చేయకపోవడంతో అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​, చత్తీస్​గఢ్​, రాజస్థాన్​ వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువైపోయింది. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా నియంత్రణతో జనాభా స్థిరీకరణ దశకు వచ్చింది.  ప్రస్తుతం పార్లమెంట్​లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతంగా ఉంది. కానీ, ఇప్పుడు ఇక్కడి జనాభా పరిస్థితుల దృష్ట్యా డీలిమిటేషన్​ను చేపడితే ఆ ప్రాతినిధ్యం కాస్తా 19 శాతానికి పడిపోయే ప్రమాదముంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుంది’’ అని అన్నారు. 

కేంద్ర మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నరు

గతంలో నాలుగుసార్లు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్​ చేశారని.. కానీ, 1971 తర్వాత చేయలేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘డీలిమిటేషన్​తో రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని, అంతరాలు ఎక్కువైతాయని ఇందిరా గాంధీ దూరదృష్టితో ఆలోచించి 1975లో రాజ్యాంగ సవరణ చేశారు. 25 ఏండ్లపాటు అప్పటికే ఉన్న 543 పార్లమెంట్​ స్థానాలే ఉండేలా చూశారు. వివిధ రాష్ట్రాల్లోని సీట్ల ప్రకారమే ఎన్నికలు జరిపేలా రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తర్వాత 2002లో అప్పటి ప్రధాని వాజ్​పేయి కూడా పాత విధానాలనే మరో 25 ఏండ్లు కొనసాగించేలా ఇందిరా గాంధీ బాటలోనే నడిచారు. అందులో భాగంగా 543 పార్లమెంట్​ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలైన ఉమ్మడి ఏపీ (తెలంగాణ, ఏపీ), తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో 130 స్థానాలుంటే.. సీట్లను ఏమీ మార్చకుండా వాటినే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు  తగ్గట్టు సరిహద్దులను మార్చారు. 2006లో పాత పద్ధతి ప్రకారం ఆనాడు ఉమ్మడి ఏపీలో 42 పార్లమెంట్​ స్థానాలుంటే జనాభా దామాషా, ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం ఆ సీట్లనే కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 17, ఏపీకి 25 స్థానాలను కేటాయించారు. కానీ, ఇప్పుడు 2026లో జనాభా లెక్కలను తీసి దాని ప్రకారం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనిపై కేంద్ర మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నరు’’ అని ఆయన అన్నారు. 

కేంద్రం వివక్ష చూపుతున్నది

ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి, ఏపీలోని 175 స్థానాలను 220కి పెంచాలని చెప్పినా.. 11 ఏండ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదని సీఎం రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్​లో కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. 2026లో జనాభా లెక్కలు చేశాక డీలిమిటేషన్​ చేసేటప్పుడే అది జరుగుతుందని సమాధానం చెప్పారని, అప్పటిదాకా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలూ లేవని చెప్పారని తెలిపారు. ‘‘కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించింది. పార్టీ ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్​, సిక్కింలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. 2011 జనాభా లెక్కలనే అందుకు ప్రామాణికంగా తీసుకున్నరు. జమ్మూకశ్మీర్​లోనూ 2026 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పెంపును చేపట్టాల్సి ఉన్నా.. రాజ్యాంగాన్ని సవరించి మరీ 83 నియోజకవర్గాలను 90కి పెంచడమేకాకుండా పునర్విభజన చేశారు. సిక్కింలోనూ సీట్లను పెంచేందుకు 2018లో కేబినెట్​లో తీర్మానం ప్రవేశపెట్టి.. ఇప్పుడు అమలు చేస్తున్నరు. అసెంబ్లీ సీట్ల విషయంలో తెలంగాణపై మాత్రం కేంద్రం వివక్ష చూపుతున్నది’’ అని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్​ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గళం వినిపించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.

డీలిమిటేషన్​ దక్షిణాదికి శాపం కాకూడదు

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పౌరహక్కుల సంఘాలతో విస్తృతమైన సంప్రదింపులు, చర్చల తర్వాతే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్​ను చేపట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్టు జనాభా నియంత్రణను చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన శాపంగా మారకూడదన్నారు. ‘‘జనాభా స్థిరీకరణకు ఉద్దేశించిన 42, 84, 87 రాజ్యాంగ సవరణ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. జనాభా నియంత్రణను పకడ్బందీగా పాటించిన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్​ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి నష్టం చేయకూడదు. డీలిమిటేషన్​కు జనాభాను ఒక్కటే ప్రామాణికంగా తీసుకోరాదు. ఇప్పుడు దేశ జీడీపీలో 36 శాతం పన్నుల వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళ్తున్నది. కానీ, తిరిగి వస్తున్నది మాత్రం చాలా తక్కువే. తెలంగాణ ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే.. వస్తున్నది 42 పైసలే. ఆర్థికంగా ఇప్పటికే నష్టపోయిన మనం.. రాజకీయంగానూ నష్టపోవడానికి సిద్ధంగా లేం.   ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కి పెంచాల్సిందే. అందుకు కేంద్రం రాజ్యాంగ సవరణలు చేయాలి’’ అని సీఎం డిమాండ్​ చేశారు.