ఇపుడే పని మొదలు పెట్టాం.. చేయాల్సింది చాలా ఉంది: సీఎం రేవంత్

ఇపుడే పని మొదలు పెట్టాం.. చేయాల్సింది చాలా ఉంది: సీఎం రేవంత్
  • చేయాల్సింది చాలా ఉంది
  • రూ.20 వేల కోట్లతో దేశంలోనే
  • అతిపెద్ద రుణమాఫీ చేసినం: రేవంత్​రెడ్డి
  • సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నం
  • విద్య, వైద్యం, ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ
  • ‘తెలంగాణ’ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి
  • భారత్​ సమిట్​లో సీఎం పిలుపు

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం ఇప్పుడే పని మొదలు పెట్టిందని, చేయాల్సింది ఇంకా చాలా ఉన్నదని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్లలో ప్రజల కలలు నెరవేరలేదని, అందుకే ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని చెప్పారు.  సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.   శనివారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ –2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.  రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చేందుకు తాము చేపట్టిన మిషన్ లో చేరాలని, అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను తమతో పంచుకోవాలని   ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. అందుకోసం ‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, రాష్ట్ర గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలని కోరారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళల  నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాలపాటు పోరాటం జరిగిందని, వారి పోరాట ఫలితంగానే రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ సర్కారు నెరవేరుస్తుందని చెప్పారు. త్వరలో గిగ్, యాప్ వర్కర్స్ వెల్ఫేర్ పాలసీని  తీసుకురాబోతున్నట్లు తెలిపారు.  సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ.వెయ్యి  కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.  తమ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టిందని, ఇది  ఫేమస్​ టూరిస్ట్​ స్పాట్​గా మారి  వేలాది మందికి ఉపాధి కల్పించబోతున్నదని అన్నారు. ఆదాయాన్ని సృష్టించి, పేదలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.  

5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం

దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. నిరుడు ఆగస్టులో రూ.20,617 కోట్లు చెల్లించి 25 లక్షల 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశామని చెప్పారు. ఇంత భారీమొత్తంలో రుణమాఫీ ఎక్కడా జరగలేదని, దేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అని స్పష్టంచేశారు. అలాగే రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతుభరోసా పేరుతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామని,  భూమిలేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12వేల ఆత్మీయ భరోసా సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  పంటలకు మద్దతు ధరతోపాటు క్వింటాల్​కు అదనంగా రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వివరించారు. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని, తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 57 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. 5 లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 

విద్య, వైద్య, ఉపాధికే మా తొలి ప్రాధాన్యం 

విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ప్రైవేట్ రంగలో యువతకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించి రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు  తెలిపారు. అలాగే మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ లకు  వారినే యజమానులను చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు వివరించారు.  రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు.  అలాగే హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, 370 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణతోపాటు అనేక ఇన్ ఫ్రా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు సీఎం వివరించారు.