కేసీఆర్‌తో ఏం పని లేదు.. హ్యాపీగా ఫామ్​హౌస్‌లో రెస్ట్ తీస్కో : సీఎం రేవంత్ రెడ్డి

  • నీ ఇంట్లనే ఉద్యోగాలు పోయినయ్.. జనం ఏమీకోల్పోలే
  • కేసీఆర్​కుసీఎం రేవంత్​ రెడ్డి కౌంటర్
  • ప్రజలకు నీతో ఎలాంటి పనిలేదు
  • ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నాఇచ్చినా నీ బుద్ధి మారలే
  • అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతగాకేసీఆర్​నే చూస్తున్నం
  • దీపావళి వస్తే సారా బుడ్లు,డ్రగ్స్​తో దావత్​ చేస్కుంటరా?
  • పైగా గృహప్రవేశమని బుకాయింపు
  • ఇలాంటి వాళ్లు సమాజానికిచీడపురుగులని కేటీఆర్​పై విమర్శ
  • 99 మంది ఏఎంవీఐలకునియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​తో తెలంగాణ ప్రజలకు ఎలాంటి పనిలేదని, ఇక ఫామ్​హౌస్​లోనే ఆయన హ్యాపీగా రెస్ట్​ తీసుకోవచ్చని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం కానీ.. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతను మన దగ్గర్నే చూడాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొందని విమర్శించారు. ‘‘పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒకాయన (కేసీఆర్​) మాట్లాడుతుండు. ఏం కోల్పోయిన్రయ్యా? నీ (కేసీఆర్​) ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయిన్రు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు” అని వ్యాఖ్యానించారు. ప్రజలు గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో వాళ్లకే తెలిసి వచ్చిందంటూ రెండురోజుల కింద ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్​ కామెంట్లు చేశారు. దీనికి సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు.

  “కేసీఆర్​.. నీతో ప్రజలకెలాంటి పనిలేదు. నిన్ను తెలంగాణ సమాజం మరిచిపోయింది. ఇక అక్కడ్నే(ఫామ్​హౌస్​లో) హ్యాపీగా రెస్ట్​ తీసుకో” అని సూచించారు. ప్రజలు అధికారంలో నుంచి దించేసినా, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా కేసీఆర్​ బుద్ధి మారలేదని మండిపడ్డారు. కొత్తగా నియామకమైన 99 మంది అసిస్టెంట్​ మోటర్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్ల(ఏఎంవీఐల)కు సోమవారం ఖైరతాబాద్ లోని రవాణా శాఖ ఆఫీసులో  సీఎం రేవంత్​రెడ్డి అపాయింట్​మెంట్ ​లెటర్లు అందజేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడారు‘‘అసెంబ్లీ తర్వాత పార్లమెంట్​లో నీకు గుండు సున్నా ఇచ్చిన్రు. అయినా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా నీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేపడ్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతివ్వాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపాలుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు ఇవ్వాలి అని కోరుతున్న” అని కేసీఆర్​కు సీఎం రేవంత్​ సూచించారు. 

ఒక్కో చిక్కుముడి విప్పుతూ..!

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ  పది నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘పది నెలల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. రైతులు రుణమాఫీతో రుణ 
విముక్తులయ్యారు. కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో లబ్ధిపొందారు. దీంతో ప్రభుత్వం రూ.3,500 కోట్లు ఆర్టీసీకి అందించింది. రాష్ట్రంలో 49 లక్షల 90 వేల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్  సౌకర్యాన్ని పొందుతున్నాయి. రూ.500కే తెలంగాణ ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్​ను అందుకోగలుగుతున్నారు. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించినం. 35 వేల మంది టీచర్లకు ట్రాన్స్​పర్లు చేసినం. ఇదీ పది నెలల్లో ప్రజా ప్రభుత్వం ఘనత. ఈ పదినెలల్లో నీ(కేసీఆర్​) కుటుంబం ఉద్యోగాలు కోల్పోయింది తప్ప ప్రజలు ఏమీ కోల్పోలేదు” అని ఆయన తెలిపారు.  ‘‘బడి దొంగలు తెలుసు కానీ.. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతను ఎప్పుడైనా చూసినమా? అసెంబ్లీ సమావేశాలు వచ్చినయంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తుండే. కానీ, ఇప్పుడు ఉల్టా అయిపోయింది. కేసీఆర్​ రానే రాడాయె. 

రావాలని మేం అడగాల్సి వస్తున్నది. ఇదా ప్రతిపక్ష నేత అంటే?” అని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ వాస్తు కోసం సెక్రటేరియెట్​, ప్రగతి భవన్ కట్టుకుండు. కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినం. దీంతో తెలంగాణ సమాజాన్ని నిర్మించేది విద్యనే అని నిరూపిస్తున్నం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించినం. త్వరలో వారికి నియామకపత్రాలు అందించి, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నం” అని తెలిపారు. ‘‘ ఏఎంవీఐలకు ఈ వేదికగా సూచన చేస్తున్నా.. మీరు, మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తిని నింపండి. చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం అని వారికి విశ్వాసం కల్పించండి. ప్రభుత్వంపై నమ్మకం కలిగించండి” అని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. 

దీపావళి పండుగొస్తే  సారాబుడ్లతో దావత్​ చేస్కుంటరా? 

‘‘దీపావళి పండుగ వస్తే చిచ్చుబుడ్లు కాల్చడం మన కు తెలుసు. కానీ.. సారా బుడ్లు, డ్రగ్స్​తో దావత్ చేసు కునే వాళ్లను చూస్తున్నం. పైగా తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇది గృహప్రవేశమని బుకాయించే ప్రయత్నం చేస్తు న్నరు. ఇలాంటి వాళ్లు సమాజానికి చీడ పురుగులు” అని కేటీఆర్​పై సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘లీడర్ అంటే లీడ్ చేసేవాడు.. అందరికీ రోల్ మోడల్​గా నిలిచేలా ఉండాలి.. కానీ, దీపావళి పండుగ వస్తే డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని యువతను కోరుతున్న” అని ఆయన అన్నారు. రాష్ట్రంలోకి గంజాయి, డ్రగ్స్ రాకుండా రవా ణా శాఖ ఉక్కుపాదం మోపాలన్నారు. 

త్వరలో 3వేల ఎలక్ట్రిక్​ బస్సులు

కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ నుంచి సంపూర్ణ సహకారం ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘హైదరా బాద్‌ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో కాలు ష్య నియంత్రణపై త్వరలోనే సమగ్ర విధానం ప్రకటిస్తం. కాలుష్యం కట్టడి కోసం ఓఆర్‌ఆర్‌ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలు నగరంలో తిరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్​ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రవాణా శాఖ కృషి చేయాలి. మూసీని పునరుద్ధరించాల్సిన బాధ్యత మనపై ఉంది” అని ఆయన తెలిపారు.  

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: పొన్నం

మొదటిసారి ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ఓ సీఎం రావడం రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందని, ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 20 మంది చనిపోతు న్నారని, ఇది చాలా బాధాకరమని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.