హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 24 లక్షల మంది చదువుతున్నారు.. 10 వేల ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. కానీ ఇవాళ ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారని అన్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి మరీ పిల్లలను ప్రైవేట్‌స్కూళ్లకు పంపిస్తున్నారు.. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలలలోని సమస్యలను పరిష్కరించి.. వాటికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 1000 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏకీకృత రెసిడెన్షియల్‌గా మార్చుతామని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని.. దీని ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర యువతకు చదువుకు తగ్గ ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్ లోనూ విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
ALSO READ | ఆనాడే చెప్పా: తండ్రి, కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు ఉద్యోగాలు
ఇక, గత ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని.. మత్తుకు బానిసై యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదోవలో వెళ్తోన్న యువతను మళ్లీ క్రీడలవైపు మళ్లీస్తామన్నారు. 2036లో తెలంగాణ నుంచే బంగారు పతకాలు సాధించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నానమని పేర్కొన్నారు. ఇందుకోసం గచ్చిబౌలిలో 70 ఎకరాల విస్తీరణలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల ఫైర్ అయ్యారు. ఇకపై తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.