మోదీ గ్యారెంటీకి వారెంటీ ఖతం : సీఎం రేవంత్​రెడ్డి

మోదీ గ్యారెంటీకి వారెంటీ ఖతం : సీఎం రేవంత్​రెడ్డి

 న్యూఢిల్లీ, వెలుగు :  దేశంలో మోదీ గ్యారెంటీకి వారెంటీ ఖతమైందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ను విమర్శించే రాష్ట్ర బీజేపీ నేతలు వారణాసిలో మోదీకి వచ్చిన మెజార్టీ మాటేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల శాతంపై రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారాన్ని మోదీకి ఇస్తున్నారని.. ఇలాంటి తప్పుడు డేటా నమ్మి మోదీ మోసపోవద్దని సూచించారు. 

‘‘బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, మహారాష్ట్రలో ఆ పార్టీ పరిస్థితి ఏమైందో చెప్పాలి. మోదీ పోటీ చేసిన వారణాసిలో ఆయనకు ఎంత ఓటింగ్ శాతం దక్కిందో.. మెజార్టీ సంగతేమిటో ఆలోచించాలి” అని రాష్ట్ర బీజేపీ నేతలకు సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. మహారాష్ట్ర,  ఉత్తరప్రదేశ్​లో బీజేపీ ప్రభుత్వాలను పక్కన పెట్టి... కాంగ్రెస్ అభ్యర్థులను జనం ఎంపీలుగా గెలిపించారని అన్నారు. శనివారం ఢిల్లీలోని అశోక హోటల్​లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాను ఇతర నేతలతో కలిసి రేవంత్  రిసీవ్ చేసుకున్నారు. మీటింగ్ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే... తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలువలేకపోయిందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను సీఎం రేవంత్​రెడ్డి ఖండించారు. 

‘‘తెలంగాణలో 2019 ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలిస్తే... ఇప్పుడా సంఖ్య డబులైంది. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 స్థానాలు(అంటే ఒకస్థానం ఎక్కువ) గెలుచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇక లోక్ సభ ఎన్నికలతోపాటు జరిగిన కంటోన్మెంట్ బై పోల్​లోనూ గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని 65కు పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు కాంగ్రెస్​కు రాగా... లోక్ సభలో 41 శాతం ఓట్లు గెలుచుకుంది’’ అని వివరించారు. 

నాకు జ్యోతిష్యం తెలియదు

రాబోయే ఐదేండ్లు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందా? లేదా? అనే దానిపై తాను అంచనా వేయలేనని సీఎం రేవంత్​ అన్నారు. తనకు జ్యోతిష్యం తెలియదని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ కొనసాగే విషయాన్ని బీజేపీలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, స్వపక్షంలో ఎవరు ఉంటారనే అంశాలు డిసైడ్ చేస్తాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఏయే అంశాలను  లేవనెత్తబోతున్నాయనేది కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. చంద్రబాబును కలువబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నించగా.. అలాంటింది ఏమీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఇండియా కూటమిలోని నేతలు కూర్చొని చర్చించిన తర్వాత.. వారి సూచనలను తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు.  

రాహుల్​ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలి

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని తనతోపాటు, 140 కోట్ల మంది దేశ ప్రజలు కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేండ్లలో నరేంద్రమోదీ సర్కార్  రైతులను, యువతను, అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సరైన వ్యక్తి రాహుల్ గాంధీ అని నమ్మి ప్రతిపక్షనేతగా బాధ్యతలు తీసుకోవాలని జనం కోరుకుటుంటున్నారని తెలిపారు. దేశంలోని మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువకుల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తూనే ఉన్నారని,  ఈ విషయంలో ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఎవరికి రాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.