స్కిల్స్ లేకపోవడం వల్లే.. ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం లేదు: సీఎం రేవంత్

స్కిల్స్ లేకపోవడం వల్లే.. ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం లేదు: సీఎం రేవంత్

 రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ఈ విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రక్షాళన జరగకపోతే భవిష్యత్​ తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతా. చదువు ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో, పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ స్కూల్​లో చదివిన నాకు బాగా తెలుసు. అవసరమైతే భవిష్యత్​లోనూ విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకుంటా’’ అని చెప్పారు.  విద్యా విధానంపై బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చకు సీఎం రేవంత్​రెడ్డి సమాధానం ఇచ్చారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఎక్కువ శాతం మందికి స్కిల్స్​లేవు: రేవంత్

తెలంగాణలో ప్రతి ఏడాది 1.10 లక్షల మంది స్టూడెంట్స్​యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ ఎక్కువ శాతం మందిలో నైపుణ్యం కొరవడిందని సీఎం అన్నారు. ‘‘ఎంతో మంది ఇంజనీర్​ కోర్సులు పూర్తి చేస్తున్నా.. వారికి ఉద్యోగాలు రావట్లేదు. వీటిన్నింటిని పరిశీలిస్తే వారికి బేసిక్​స్కిల్స్​లేకపోవడం, స్కిల్స్​అప్​డేషన్​లేకపోవడం ప్రధాన కారణమని తెలుస్తున్నది’’ అని చెప్పారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ అని పేరు పెట్టామని, ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ కు సంబంధించి విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. 

2028 ఒలింపిక్స్​గోల్డ్​మెడల్​సాధించాలని లక్ష్యంతో  ముందుకు వెళ్తా మని.. క్రికెట్​లో సిరాజ్, బాక్సింగ్​ఛాంపియన్​నిఖత్​జరీన్​ప్రతిభకు మెచ్చి గ్రూప్​1 ఉద్యోగం, ఇంటి స్థలం, క్యాష్​ప్రైజ్​ఇచ్చామని వివరించారు. క్రీడలపై తెలంగాణ స్టూడెంట్స్​కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ట్రైనర్స్​కు శిక్షణ ఇవ్వడానికి ఆస్ట్రేలియాతో ఎంవోయూ కుదుర్చుకున్నామని చెప్పారు. కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి చెప్పి వంద నియోజకవర్గాల్లో వంద ఏటీసీలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రస్తుతమున్న  65 ఐటీఐలతో పాటు అడ్వా న్సుడ్​ టెక్నాలజీతో మరో 35 ఐటీఐలను రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ALSO READ | రేవంత్ విద్యా కిట్ తీసుకురావాలి: ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి

దీనిలో 14 శాతం తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. మల్లేపల్లిలో త్వరలో నాలుగు ఐటీఐలను, రాష్ట్రవ్యాప్తంగా వంద ఏటీసీలను ప్రారంభిస్తామన్నారు.   ‘‘విద్యాశాఖ పై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సమూలమైన మార్పులు తేవాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. తాను సీఎం అయ్యాక విద్యా రంగంలో ప్రత్యేక విధానం తేవాలని నిర్ణయించామన్నారు. అందు కే విద్యా​కమిషన్​ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ముందు సభలో చర్చ పెడతామని.. సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు పోతామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.