రాష్ట్ర సంపద పెంచుతం అందుకే ఎంఎస్​ఎంఈ పాలసీ: సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్ర సంపద పెంచుతం అందుకే ఎంఎస్​ఎంఈ పాలసీ: సీఎం రేవంత్​రెడ్డి
  • దళితులు, మహిళలను ప్రోత్సహించేలా కొత్త విధానం
  • మాది గడీల మధ్య ఉన్న సర్కార్​ కాదు.. ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం
  • రాష్ట్రాభివృద్ధికి ఎవరైనా సలహాలు ఇవ్వొచ్చు
  • అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వం
  • మూసీని హడ్సన్​, థేమ్స్​ నదుల్లా సుందరంగా మారుస్తామని వెల్లడి
  • తెలంగాణ ఎంఎస్​ఎంఈ పాలసీ విడుదల

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్ర సంపదను పెంచాలన్న ఆకాంక్షతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ) పాలసీని తీసుకొచ్చామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. దళితులు, మహిళలను ప్రోత్సహించేలా కొత్త విధానం ఉంటుదన్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి అని, ప్రపంచంలో చాలా దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టేవని, కానీ కరోనా తర్వాత పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా తర్వాత పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్నది తెలంగాణలోనేనని తెలిపారు. 

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుపరిచేందుకు ఎంఎస్​ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం హైదరాబాద్​ శిల్పకళా వేదికలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబుతో కలిసి  ‘తెలంగాణ ఎంఎస్​ఎంఈ పాలసీ –2024’ను సీఎం రేవంత్​ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం వంటివి వచ్చినా పారిశ్రామిక విప్లవం రాలేదని అన్నారు. 

ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, అలాంటి పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహారావు దూరదృష్టితో వ్యవహరించి పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకొచ్చారని ఆయన వివరించారు. ఎంఎస్​ఎంఈలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్​ బాబు గొప్ప ఆలోచన చేశారని కొనియాడారు.

చదువుకు, ఉద్యోగాలకు పొంతన ఉంటలే

చాలా మంది చదివిన చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన ఉండడం లేదని.. కారణం నైపుణ్యాలు లేకపోవడమేనని సీఎం రేవంత్​ అన్నారు. అందుకే యువతలో నైపుణ్యాలు పెంచేలా 65 ఐటీఐలను అడ్వాన్స్డ్​ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, టాటా ఇన్​స్టిట్యూట్​తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.2400 కోట్లలో టాటా సంస్థనే రూ.2,100 కోట్లను సీఎస్​ఆర్​ ఫండ్​ ద్వారా వేలాది మంది యువతకు శిక్షణ అందించనుందన్నారు. రూ.300 కోట్లను మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు. 

ఆనంద్​ మహీంద్ర చైర్మన్​గా స్కిల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, బయటకు వచ్చాక ఉద్యోగం కచ్చితంగా దొరుకుతుంది అనేలా స్కిల్​ యూనివర్సిటీలో శిక్షణ ఉంటుందన్నారు. దాని కోసం రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కార్పస్​ ఫండ్​ను ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి సీఎస్​ఆర్​ ఫండ్స్​ను క్రియేట్​ చేసేందుకు గెటు టు గెదర్​ పార్టీ లాంటిది అరెంజ్​ చేస్తున్నామని చెప్పారు. ఆ నిధులను యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా విధి విధానాలను ఖరారు చేశామన్నారు.  

ఎవుసంతోపాటు వ్యాపారంపైనా ఫోకస్​ పెట్టాలి

రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావని సీఎం రేవంత్​  అన్నారు. ‘‘రైతుల కష్టాలను తీర్చేలా రూ.2 లక్షల రైతు రుణమాఫీని చేశాం. తద్వారా వ్యవసాయం పండుగ అని నిరూపించాం. చాలా చోట్ల ఒక కుటుంబంలోని ఎక్కువ మంది కేవలం వ్యవసాయానికే పరిమితమవుతున్నారు. వ్యవసాయాన్ని వదలకుండా.. ఇటు ఉపాధి అవకాశాలనూ మెరుగుపరచుకునేలా ప్రతి ఇంట్లో ప్రణాళికబద్ధంగా ఉండాలి. ఒక కుటుంబంలోని కొందరు వ్యవసాయం చేస్తే.. మరికొందరు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలి. వ్యాపారాల్లో రాణించేలా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించాలి. 

తద్వారా రైతుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులూ మెరుగవుతాయి. ఏపీలో చాలా కుటుంబాలు ఇలా చేసే ఆర్థిక పరిపుష్టిని సాధించాయి. ఒకప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో పది ఎకరాలు కొనే వారని.. కానీ, ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనే పరిస్థితి ఉంది” అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ టర్మ్​లోనే రూ.7 లక్షల కోట్ల బడ్జెట్​ను పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆకాంక్షించారు. ఇప్పుడు రూ.3లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్​.. 2028 నాటికి రూ.7 లక్షల కోట్లు అవుతుందన్న నమ్మకం ఉందని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. 

మూసీని సుందరీకరిస్తం

ఇప్పటిదాకా మూసీ అంటే ఓ మురికి కూపం అనే ముద్ర పడిపోయిందని.. కానీ, మూసీ మురికి కూపం కాదు అనేలా అభివృద్ధి చేస్తామని రేవంత్​ తెలిపారు. ‘‘మూసీని మ్యాన్​మేడ్​ వండర్​గా తీర్చిదిద్దబోతున్నాం. అమెరికాలో హడ్సన్​ రివర్​లా, లండన్​లో థేమ్స్​ నదిలా మూసీని సుందరీకరిస్తాం. వ్యాపారాలు చేసుకునేందుకూ మూసీ పరిసరాలను మారుస్తాం” అని పేర్కొన్నారు. 

తమ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదని..  స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్​ చేసుకునేలా శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో వాటి నిర్వహణను మహిళలకే అప్పగిస్తున్నామని చెప్పారు. యూనిఫామ్​లు కుట్టే బాధ్యతను వారికే ఇస్తున్నామని, ఇంతకుముందు ఒక్క యూనిఫాం కుడితే రూ.25గా ఉంటే.. దానిని రూ.75కి పెంచామని సీఎం తెలిపారు.

రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇవ్వండి

పాలసీ డాక్యుమెంట్​ లేకుండా ఏ రాష్ట్రమూ అభివృద్ధి సాధించలేదని సీఎం రేవంత్​ అన్నారు. అందుకే ఎంఎస్​ఎంఈ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఎంఎస్​ఎంఈలకు ఎన్నో హామీలను ఇచ్చిందని, వాటిని కూడా తీరుస్తామన్నారు. పరిశ్రమల విషయంలో గత సర్కారు విధానాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలను అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకూ తావివ్వమన్నారు. తమది గడీల మధ్య ఉన్న సర్కార్​ కాదని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వమని తెలిపారు. ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చని, తమ ఆఫీసుల తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇవ్వొచ్చని అన్నారు.

ఎంఎస్ఎంఈలకు పెండింగ్ నిధులిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

ఎంఎస్ఎంఈలకు పెండింగ్​లో ఉన్న రూ.2 వేల కోట్ల నిధులను దశలవారీగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలను ప్రకటించినా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కొత్త పాలసీలో సామాజిక న్యాయం కనిపిస్తున్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ‘‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీ లేదు. కేవలం పారిశ్రామిక పాలసీనే ఉంది. కానీ మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వాటి కోసం ప్రత్యేక పాలసీ తెచ్చింది. కొత్త పాలసీ రాష్ట్రాభివృద్ధితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది” అని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ జీడీపీ పెరగాలంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని ప్రోత్సహిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయన్నారు. 

కాంగ్రెస్​తోనే ఎక్కువగా ఎంఎస్ఎంఈలు.. 

రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉండడానికి కారణం నాటి కాంగ్రెస్​ ప్రభుత్వాలేనని భట్టి అన్నారు. ‘‘బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డీఆర్డీవో, ఐడీపీఎల్​ వంటి భారీ పరిశ్రమలు హైదరాబాద్​లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ​ప్రభుత్వాలే. వాటికి అనుసంధానంగా ఎంఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో వచ్చాయి” అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరంపై తాజ్​ డెక్కన్​లో రాహుల్​ గాంధీ ప్రత్యేక సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎంఎస్ఎంఈలే కీలకమని ఆయన చెప్పారన్నారు. 

ఈ క్రమంలోనే సీఎం రేవంత్​ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు ఎంఎస్ఎంఈల కోసం కొత్త పాలసీ తీసుకొచ్చారన్నారు. ‘‘దేశంలోని చాలా రాష్ట్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. మహారాష్ట్రలో 5,082, తమిళనాడులో 2,486, గుజరాత్​లో 1,626 ఇండస్ట్రీలు మూతపడితే.. తెలంగాణలో అతి తక్కువగా 231 పరిశ్రమలు మాత్రమే మూతపడ్డాయి” అని చెప్పారు.

ఎంఎస్​ఎంఈలకు టాస్క్​ఫోర్స్: శ్రీధర్​ బాబు

ఎంఎస్​ఎంఈల కోసం అతి త్వరలోనే ప్రత్యేకంగా టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. వాటి కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్​ఎంఈల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు సమగ్ర సర్వేను నిర్వహించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీల్లో మెషినరీ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఎంఎస్​ఎంఈలు ఉత్పత్తి చేసిన ప్రొడక్టుల మార్కెటింగ్​కు సౌకర్యాలను కల్పించేందుకు సమాలోచనలను చేస్తున్నామన్నారు. ఎంఎస్​ఎంఈలకు ల్యాండ్​ లీజ్​పాలసీని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. పరిశ్రమలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తామన్నారు. ఎంఎస్​ఎంఈల సహకారంతోనే ట్రిలియన్​ డాలర్ల ఎకానమీ సాధ్యమవుతుందన్నారు. కాగా, హైదరాబాద్​కు సమానంగా జిల్లాల్లోనూ ఎంఎస్​ఎంఈల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.