మాటిచ్చినం..మాఫీ చేసినం : సీఎం రేవంత్ రెడ్డి

మాటిచ్చినం..మాఫీ చేసినం : సీఎం రేవంత్ రెడ్డి
  • పంద్రాగస్టు రోజే రూ.2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం: సీఎం
  • రూ. 31 వేల కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర
  • మాది మాట నిలబెట్టుకునే గుణం.. బీఆర్ఎస్​ది మోసం చేసే నైజం
  • హరీశ్​ రావ్​..! రాజీనామా చేస్తవా, ముక్కు నేలకు రాస్తవా..?
  • ప్రాజెక్టులపై, పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేం రెడీ
  • కేటీఆర్​, హరీశ్​ నోరెత్తితే అబద్ధాలే.. ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్లకు బుద్ధి రాలే
  • బీఆర్​ఎస్​ను పెకిలించేస్తం.. రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని వ్యాఖ్య
  • ఖమ్మం జిల్లా వైరా వేదికగా రూ. 2లక్షల రుణమాఫీ అమలు

ఖమ్మం, వెలుగు : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.31 వేల కోట్ల నిధులను విడుదల చేసి, రైతులను రుణవిముక్తులను చేశామని చెప్పారు. తమది మాట నిలబెట్టుకునే గుణం అయితే, బీఆర్ఎస్​ది మోసం చేసే నైజమని ఆయన అన్నారు. ‘‘పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్​ రావు ఆనాడు సవాల్ చేసిండు. హరీశ్​రావ్​..! నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్. సిద్దిపేట ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం.

రాజీనామా చేయకపోతే అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, రైతులకు క్షమాపణ చెప్పు” అని డిమాండ్​ చేశారు. బీఆర్​ఎస్​ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం లేక ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్​ఎస్ నేతల అబద్ధపు ప్రచారాలను ఎవరూ నమ్మరని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు, సీతారామ ప్రాజెక్టు పంప్​హౌస్​ల ప్రారంభం, ఏన్కూరు లింక్​ కెనాల్​ ఓపెనింగ్ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు.

బీఆర్ఎస్​కు ప్రతి ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్తున్నా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారడం లేదని సీఎం అన్నారు.  

ఆరు గ్యారెంటీల అమలుకు ప్రతిక్షణం కష్టపడ్తున్నం

వరంగల్ రైతు డిక్లరేషన్​లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 8 నెలలు దాటకముందే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని సీఎం రేవంత్​ తెలిపారు. గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో  రైతులకు బేడీలు వేసింది గత బీఆర్ఎస్​ ప్రభుత్వమని, ఆ రైతులకు రుణమాఫీ చేసి రైతులను రాజులను చేసింది కాంగ్రెస్​ పార్టీ అని పేర్కొన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నామని సీఎం రేవంత్​ అన్నారు.  ‘‘కాంగ్రెస్​ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే.. డబుల్ బెడ్రూం  ఇండ్లు ఇస్తామని చెప్పి జనాన్ని కేసీఆర్ మోసం చేసిండు” అని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు భద్రాచలం కేంద్రంగా ఇచ్చిన హామీ ప్రకారమే ఇప్పుడు మూడు పంప్​ హౌస్​ లను ప్రారంభించుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకే కృష్ణా జలాలు రాని సమయంలో గోదావరి జలాలు ఉపయోగించుకునేలా లింక్​ కెనాల్ ను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఎన్ని వేల కోట్లు అవసరమైనా వరదలాగా నీళ్లు పారించి, రెండేండ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఏడు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని స్పష్టం చేశారు.

మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా 32 టీఎంసీల నీరు ఉపయోగించే అవకాశం ఉందని, సాంకేతిక నిపుణులతో చర్చించి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, డోర్నకల్ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా 15 టీఎంసీల రిజర్వాయర్​ నిర్మిస్తామని, అవసరమైన ప్రణాళికలు రచిస్తామని సీఎం చెప్పారు.​ తమది మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమన్నారు. హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని

ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని వివరించారు. ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాంచంద్రునాయక్,​ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, సీఎస్​ శాంతికుమారి, ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

బావబామ్మర్దులు నోరెత్తితే అబద్ధాలే..

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​కు మిగిలింది గాడిద గుడ్డేనని.. అయినా ఆ పార్టీ నేతల​తీరు మారలేదని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. ‘‘బావబామ్మర్దులు (హరీశ్​రావు, కేటీఆర్​) నోరెత్తితే అబద్ధాలే చెప్తున్నరు. ఆ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నరు. కాంగ్రెస్​ కార్యకర్తలు అండగా ఉంటే బీఆర్ఎస్​ను సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత తీసుకుంట” అని సీఎం అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని, కాంగ్రెస్​ కార్యకర్తలు అండగా ఉంటే బీజేపీని బొందపెట్టేది పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఎనిమిది సీట్లు ఇస్తే, కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి నరేంద్ర మోదీ ఇచ్చింది ఏమిటని సీఎం ప్రశ్నించారు.

ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ‘‘ప్రాజెక్టులపై బీఆర్​ఎస్​కు డిప్యూటీ సీఎం భట్టి విసిరిన సవాల్​తో నేనూ ఏకీభవిస్తున్న. వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పాలనపై ఏ సెంటర్​లోనైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. హరీశ్​, కేటీఆర్ ఎవరు వస్తారో రండి, అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు రెడీ” అని రేవంత్​ అన్నారు. సాంకేతిక సమస్యలతో ఏ రైతుకైనా రుణమాఫీ కాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కచ్చితంగా మాఫీ అవుతుందని సీఎం హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదని.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల, ఎస్​ఎల్బీసీ టన్నెల్​, సీతారామ సాగర్​ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని సీఎం రేవంత్​ తెలిపారు. 

ప్రాజెక్టులపై చర్చకు బీఆర్ఎస్​ సిద్ధమా?: భట్టి

కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, బీఆర్ఎస్​ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులపై కేటీఆర్​గానీ, హరీశ్​రావు గానీ​ చర్చకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. ‘‘మీ మానస పుత్రికలు అవినీతిమయం, మా ప్రాజెక్టులు ప్రజల పరం” అని అన్నారు. ‘‘ఈ రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు ప్రారంభించాం, తక్కువ ఖర్చుతో ఏమి పూర్తి చేశాం, చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా నేను, మంత్రి ఉత్తమ్ సిద్ధం” అని బీఆర్​ఎస్​కు చాలెంజ్​ విసిరారు. ‘‘సీతారామ ప్రాజెక్టు గురించి హరీశ్, కేటీఆర్​ సహా ఒకరిద్దరు ఇప్పుడు ఏదేదో మాట్లాడ్తున్నరు. డబ్బుల కోసం కక్కుర్తి పడి, ఈ జిల్లాకు నీళ్లు రావొద్దని, ఇతర దుర్మార్గపు ఆలోచనలతో ప్రాజెక్టుల ఖర్చు రూ.23 వేల కోట్లకు పెంచింది మీరు(బీఆర్​ఎస్​) కాదా?

ఇందిరాసాగర్​, రాజీవ్​ సాగర్​ రెండూ కలిపి రూ.1,548 కోట్లు.. 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది అయితే, వాటిని రీడిజైన్ చేసి రూ.23 వేల కోట్లకు పెంచారు. బీఆర్ఎస్​ హయాంలో రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టారు. అయినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తీయలేదు. మెయిన్​ కెనాల్ 114 కిలోమీటర్లు నడవాల్సిన కాల్వలు పూర్తికాలేదు. మరి డబ్బులన్నీ ఎటుపోయాయి?” అని నిలదీశారు.  వైరా లింక్​ కెనాల్​కు భూములిచ్చిన ప్రతి ఎకరానికి డబ్బులిస్తామమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 

రెండేండ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి: ఉత్తమ్​

సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులను రెండేండ్లలో పూర్తి చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గోదావరి నీళ్లిస్తామని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావాలన్నది దశాబ్దాల కల అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్​ హయాంలో 4 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు రాజీవ్​సాగర్​ ఇందిరా సాగర్​ మొదలు పెట్టి, దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చుచేస్తే.. రీ డిజైన్​ పేరుతో అంచనాలు పెంచి బీఆర్ఎస్​ మోసం చేసిందని మండిపడ్డారు. పదేండ్లుగా రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టి, ఒక్క ఎకరానికి కూడా బీఆర్ఎస్​ నీరందించలేదని అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

తుమ్మల నాగేశ్వర్​రావు నిరంతర ఫాలో అప్​ ద్వారా, వారి సలహా మేరకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్​ను ముందుకు తీసుకెళ్లాం. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి అండగా ఉన్న ఇక్కడి ప్రజలకు తమ ప్రభుత్వం కృతజ్ఞతగా ఉంటుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి, ఇక్కడ కూర్చున్నామంటే అది ఇక్కడి కార్యకర్తల కృషే. 77 ఏండ్ల దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో రూ.2లక్షల రుణమాఫీ జరగలేదు. ఇది చరిత్రలో నిలబడే విషయం.  యూపీఏ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా అందరికీ రుణమాఫీ జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్కసారి కూడా చేయలేదు”అని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. 

రుణమాఫీ.. ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం: తుమ్మల

ఒకే పంట కాలంలో రూ.2 లక్షల్లోపు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసి చూపించడం తమ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం చేసిన విధంగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలనే ఒత్తిడి రావాలని పేర్కొన్నారు. గోదావరి జలాలను రాజీవ్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు, సాగర్ ఆయకట్టుకి నీరందించాలని రూ.600 కోట్లు శాంక్షన్ చేసి, కేవలం మూడ్నాలుగు నెలల కాలంలోనే లింక్​ కెనాల్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులకు తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఎనిమిది కిలోమీటర్ల మేర లింక్​ కెనాల్ కోసం భూములిచ్చారని, వారందరికీ సీఎం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని తుమ్మల హామీ ఇచ్చారు.  

మడమ తిప్పకుండా రుణమాఫీ: వెంకట్​రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చి ఆగస్టు 15 నాటికి మడమ తిప్పకుండా రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేశారని మంత్రి  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్​నగర్​, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 99 శాతంతో 
36 సీట్లలో కాంగ్రెస్​ను గెలిపించడమే కారణమని ఆయన తెలిపారు. వైఎస్​ హయాంలో ఎస్​ఎల్​బీసీని శాంక్షన్​  చేసిన తర్వాత, కుర్చీ వేసుకొని పనులు చేయిస్తానని చెప్పిన పెద్ద మనిషి(కేసీఆర్​) పదేండ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్,  మంత్రి ఉత్తమ్​ నాయకత్వంలో ఎన్ని కోట్లైనా సొరంగాన్ని పూర్తి చేసి, నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా రూపుమాపుతామని ఆయన అన్నారు.  

కుట్రలతో కేసీఆర్​ చుక్క నీరివ్వలే: పొంగులేటి  

కుట్రలు, కుళ్లు, కుతంత్రాలతో కేసీఆర్​ ఖమ్మం జిల్లాకు పదేండ్లు చుక్కనీరు కూడా ఇవ్వలేదని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ప్రాజెక్టుని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగానే  ప్రారంభించుకోవడం జిల్లా ప్రజలందరికీ ఎంతో సంతోషదాయకమని అన్నారు. రైతును రాజును చేయాలని వరంగల్​లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలపై రూ.7.18 లక్షల కోట్ల భారాన్ని మిగిల్చి పోయిందని, నెల వారీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టిందని అన్నారు. అయినా వెనుకడుగు వేయకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని మంత్రి చెప్పారు. 

బీఆర్ఎస్​కు అసెంబ్లీ ఎన్నికల్లో 

39 సీట్లతో జనం గుణపాఠం చెప్పినా.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా.. 7 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసినా.. ఆ పార్టీ నాయకులకు బుద్ధిరాలేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేని దీన స్థితికి బీఆర్ఎస్​ రావడానికి కారణం ఆ పార్టీ లీడర్లే. అయినా ప్రజల్నే వాళ్లు నిందిస్తున్నరు. బావబామ్మర్దులు (హరీశ్​రావు, కేటీఆర్​) నోరెత్తితే అబద్ధాలే.  ఆ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నరు. కాంగ్రెస్​ కార్యకర్తలు  అండగా ఉంటే బీఆర్ఎస్​ను సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంట.

- సీఎం రేవంత్​రెడ్డి