పీవోకేను భారత్​లో కలపాలి..ప్రధానికి మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పీవోకేను భారత్​లో కలపాలి..ప్రధానికి మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
  • టెర్రరిజంపై రాజకీయాలకతీతంగా పోరాడాలి
  • పహల్గాం దాడి హేయమైన చర్య: సీఎం రేవంత్​
  • దోషులను కఠినంగా శిక్షించాలి 
  • పీవోకేను భారత్​లో కలపాలి
  • ప్రధానికి మద్దతిస్తామని వెల్లడి
  • పహల్గాం మృతులకు  పీసీసీ ఆధ్వర్యంలో నివాళి
  • టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డులోని  ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ
  • పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్​

హైదరాబాద్ / గండిపేట, వెలుగు : దేశంలోని140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత్‌‌లోకి చొచ్చుకొచ్చి.. పాక్‌‌ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్​లోని   పహల్గాం దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌‌లో పీసీసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్‌‌ ప్లాజా నుంచి నెక్లెస్​ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పహల్గాం ఘటనలో మృతి చెందిన వారికి సీఎం రేవంత్ తో పాటు ఇతర నేతలు నివాళి అర్పించి, సంతాపం ప్రకటించారు. 

ఇస్లాంలో హింసకు తావులేదు: అసదుద్దీన్ ఒవైసీ

ఇస్లాం మతంలో హింసకు తావులేదని ఎంపీ అసదుద్దీన్‌‌ ఒవైసీ అన్నారు. జమ్మూ కాశ్మీర్​లోని పహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​శాస్త్రీపురం మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొనడానికి చేతికి నల్ల రిబ్బన్​కట్టుకుని వచ్చారు. ప్రార్థనలకు హాజరైన ముస్లింలకు నల్ల రిబ్బన్లు పంచారు. ఈ సందర్భంగా అసదుద్దీన్​ మాట్లాడుతూ.. ఇస్లాంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వారికి స్థానం లేదన్నారు.పహల్గాం దాడితో పాకిస్తాన్‌‌ మరోసారి తాను ఉగ్రవాద దేశమని నిరూపించుకుందన్నారు.   పహల్గాం దాడికి మన దేశం గట్టి జవాబు ఇస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.. కాగా,  శుక్రవారం చార్మినార్ ​మక్కా మసీదు వద్ద ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో నల్ల బ్యాడ్జీలు, రిబ్బన్లతో పాల్గొన్నారు. తర్వాత ‘పాకిస్తాన్ ముర్దాబాద్.. హిందుస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలతో చార్మినార్​పరిసర ప్రాంతాల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.  అసదుద్దీన్ ఒవైసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ కొనసాగింది. 

ఉగ్రవాదంపై పోరులో ప్రధానికి సహకరిస్తం: సీఎం రేవంత్​

పహల్గాం దాడిని కాంగ్రెస్​ తరఫున ఖండిస్తున్నామని సీఎం రేవంత్​ తెలిపారు. అందరం ఏకమై  ఉగ్రవాదాన్ని అంతమొందించి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టెర్రరిజంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీటుగా జవాబిచ్చారని గుర్తుచేశారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా రెండు ముక్కలు చేశారని, ఆ సందర్భంలో ఇందిరాగాంధీని బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయ్.. దుర్గామాతతో పోల్చారని అన్నారు. ‘‘ప్రధాని మోదీ కూడా దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి. ఒక్క దెబ్బతో పాకిస్తాన్​ను రెండు ముక్కలు చేయండి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి” అని సీఎం రేవంత్ సూచించారు. ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.