పరిశ్రమలు వస్తేనే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం (మార్చి 28) జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు వస్తేనే అభివృద్ది జరుగుతుంది. అభివృద్ది పెరిగే కొద్దీ భూముల ధరలు పెరుగుతాయన్నారు. పరిశ్రమల కోసం భూములు కొనుగోలు చేస్తాం.. అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల ధర కట్టిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి.. త్వరలో ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ అన్ని విధాలా అభివృద్ది చేసి రాష్ట్రానికి నమూనాగా చూపిస్తామన్నారు. త్వరలో కొడంగల్ ప్రాంతంలో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టి బిసీ హాస్టల్ నిర్మాణం చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.